లక్షల ఓట్లు గల్లంతు!

x
Highlights

తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఓటు హక్కు ఉపయోగించుకోలేకపోయారు. ఓటు వేద్దామని వచ్చి వేయలేక తిరిగి వెళ్ళిన...

తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఓటు హక్కు ఉపయోగించుకోలేకపోయారు. ఓటు వేద్దామని వచ్చి వేయలేక తిరిగి వెళ్ళిన వారెందరో ఉన్నారు. దీనికి కారణం ఓటర్ల జాబితాలో వారి పేర్లు లేకపోవడమే. ఓటు నమోదు చేసుకున్నా వారి పేర్లు జాబితాలో కనిపించకపోవడమే. ఓట్లు గల్లంతయిన వారి సంఖ్య వందలు వేలల్లో కాదు లక్షల్లో ఉందంటే ఎవరైనా సరే అవాక్కవ్వాల్సిందే. అవును ఇది నిజం. పలు తెలంగాణ జిల్లాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు మాయమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని 24 నియోజకవర్గాలతో పాటు ఆదిలాబాద్, కుమ్రం భీం జిల్లా వనపర్తి, నిజమాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా ఓట్ల గల్లంతు జరిగింది. హైదరాబాద్‌లోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, జూబ్లీ హిల్స్‌లో భారీగా ఓట్ల గోల్ మాల్ జరిగింది. లక్షల సంఖ్యలో ఓట్లు గల్లతవ్వడంతో ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశ ముందనే ఆందోళన నెలకొంది.

ఓట్లు గల్లంతవ్వడానికి , చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఓటరు జాబితా సవరణ జరిగిన తర్వాత తమ ఓట్లు ఉన్నాయా? తొలగించారా? అన్నది చాలామంది చెక్ చేసుకోలేదు. అలాగే ఎన్నికల సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ల జాబితా వైరిఫై చేయడంలో విఫలమయ్యారు, దీంతో పాటు పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో వెబ్‌సైట్‌ పనిచేయ లేదు. ఈ కారణంతో పోలింగ్‌ కేంద్రం, సీరియల్‌ నంబరు తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. సాక్షాత్తు మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యాయి. పలువురు వీవీఐపీలదీ అదే పరిస్థితి. సామాన్యుల పరిస్థితి మరీ దారుణం.

గడిచిన ఎన్నికల్లో ఓటు వేశాం. ఓటరు కార్డూ ఉంది. అయినా ఇప్పుడు తొలగించారు. ఆన్‌లైన్‌లో ఉంది. పోలింగ్‌ కేంద్రానికి వెళ్తే లేదన్నారు. ఇదీ శుక్రవారం జరిగిన ఎన్నికల క్రతువులో లక్షల మంది ఆవేదన. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంలో ఎన్నికల సంఘం విఫలమైందనేందుకు ఇదో నిదర్శనం. అవును నిజమే, ఓట్లు గల్లంతయ్యాయి! బాధ్యత మాదే. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ అంగీకారం
ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టిన నాటి నుంచే పలు రాజకీయ పార్టీలు ఓట్ల గల్లంతుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల వరకు పదేపదే ఫిర్యాదులు చేశాయి. అయినా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చతికిలపడ్డారు. బోగస్‌ ఓట్లు, బినామీల వివరాలను కట్టలు కట్టలుగా తెచ్చి ఇచ్చినా పట్టించుకున్న నాథులు లేరు. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఓ ప్రహసనంలా సాగుతోంది. నిబంధనల ప్రకారం పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించాలి. ఆ చిరునామాలో ఓటరు లేరని గుర్తించిన పక్షంలో ముందస్తుగా ఆ ఇంటి యజమానికి నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసులను గ్రామ పంచాయతీ, పురపాలిక, తహసీల్దారు, ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ ప్రదర్శించాలి. అత్యధిక శాతం సందర్భాల్లో ఆ తనిఖీ కాగితాలకే పరిమితమవుతోంది. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లో కూడా ఈ వ్యవహారం మొక్కుబడిగా సాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంటున్న వారి ఓట్లను వారి ప్రమేయం లేకుండా తొలగించడం, తిరిగి నమోదు చేసుకున్నా చాలా మందికి ఓటు హక్కు కల్పించడంలో ఎన్నికల సంఘం చతికిలపడటం ఈ లోపాలను చెప్పకనే చెబుతోంది.

దరఖాస్తు దారులకు చుక్కలు
ఎన్నికల ముందు వరకు రాష్ట్రంలో దాదాపు 32 లక్షల మంది ఓటు కోసం పేరు నమోదు చేసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. వారిలో అయిదున్నర లక్షల మంది మాత్రమే కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా..మిగిలిన వారు గతంలో ఓటు ఉండి తొలగింపునకు గురైన వారు, పేరు, చిరునామా మార్పులతో దరఖాస్తు చేసిన వారే. వీరిలో చాలా మందికి చివరి నిమిషం వరకు ఓటరు గుర్తింపు లభించలేదు. మరికొందరికి గుర్తింపు లభించినా ఆన్‌లైన్‌లో ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్‌ కాలేదు. ఫలితంగా వారంతా ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు.

సమస్యలెన్నో..పరిష్కరించే వారేరి?
*ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ అమలు తర్వాత దొంగ ఓట్లు తొలగిపోయాయని ఈసీ ఘంటాపథంగా చెప్పింది. అందుకు భిన్నంగా చాలామంది రెండు మూడు చోట్ల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* ఓటు హక్కు ఉన్న భార్యభర్తలు, కుటుంబ సభ్యులకు వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలు కేటాయించారు. పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన వాళ్లు ఇళ్లకు తిరుగు పయనమయ్యారు.

ఈసీదే బాధ్యత: టీపీసీసీ ఎన్నికల కమిషన్‌
ఈ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు ఘటనలకు ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని టీపీసీసీ ఎన్నికల కమిషన్‌ కన్వీనర్‌ జి.నిరంజన్‌ డిమాండ్‌ చేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాతో జనవరిలో పంచాయతీ ఎన్నికలు ఎలా జరుపుతారని శనివారం ఆయనొక ప్రకటనలో ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దయిన ఆర్నెల్ల లోపు ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ తొందరపడిందని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించకుండానే ఎన్నికలకు వెళ్లిందని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories