హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనాలతో నలుగురు అనాథల జీవితాల్లో వెలుగులు

Highlights

ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయస్సు వారిది. కన్నతల్లి కనికరం లేకుండా వదిలి వెళ్లిపోయింది. అన్నీ తానైన తండ్రిని కూడా ప్రమాదం కాటేసింది. ఆ చిన్నారులు అనాథలుగా...

ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయస్సు వారిది. కన్నతల్లి కనికరం లేకుండా వదిలి వెళ్లిపోయింది. అన్నీ తానైన తండ్రిని కూడా ప్రమాదం కాటేసింది. ఆ చిన్నారులు అనాథలుగా మారారు. ఆదుకునే వారి కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ఆపన్న హస్తం కోసం ఆశగా చూస్తున్న ఆ చిన్నారులను హెచ్‌ఎంటీవీ అక్కున చేర్చుకుంది. వారి దీనగాథపై వరుస కథనాలను ప్రసారం చేసింది. ఈ కథనాలకు స్పందించిన దాతలు ఎందరో ముందుకు వచ్చారు. అప్పుడే పదకొండు నెలలు గడిచిపోయాయి. మరిప్పుడు ఆ నలుగురు చిన్నారులు ఇప్పుడేం చేస్తున్నారు? ఎలా ఉన్నారు?

ఒకప్పుడు వారు అభాగ్యులు. అందరూ ఉన్న అనాథలు. అవును హెచ్‌ఎంటీవీ చేసిన కృషితో వారిప్పుడు బంగరు భవిత కోసం బాటలు వేసుకుంటున్నారు. పదకొండు నెలల కింద ఎవరూ లేక, తమ వారెవరో తెలియక అత్యంత దీనంగా ఉన్న ఆ నలుగురు అక్కాచెల్లెళ్లు ఇప్పుడు ఇంగ్లీష్‌ మీడియం చదువులు చదువుతున్నారు. హాస్టల్‌ ఉంటూ హాయిగా జీవనం సాగిస్తున్నారు.

ఈ చిన్నారులను గుర్తుపట్టారా? సరిగ్గా చూడండి? ఇంకాస్త లోతుగా పరిశీలించండి.? ఈ నలుగురు అక్కాచెల్లెళ్లపై జనవరి వరకు అనాథలు. ఈ అభాగ్య చిన్నారులపై హెచ్‌ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలతో మానవత్వం మరోసారి పరిమళించింది. దాతల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. సరిగ్గా 11 నెలల కిందటి మాట. నాగర్‌కర్నూల్‍ జిల్లా అచ్చంపేటకు చెందిన ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు నా అనే వారు లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న వారే. ఇదిగో ప్రస్తుతం ఇప్పుడిలా కాన్వెంట్‍ స్కూళ్లో ఇంగ్లిష్‌ మీడియం చదువులు చదువుతూ బంగారు భవిత కోసం కలలు కంటున్నారు.

అచ్చంపేటకు చెందిన దేవానంద్, ఎల్లమ్మ దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు. భర్తతో గొడవ పడి, లక్ష్మీ ఎటో వెళ్లిపోయింది. అందరి సాకే ఆర్థిక స్థితి లేని దేవానంద్‌ అందరికంటే చిన్నదాన్ని పెంపకానికి పంపించాడు. మిగిలింది నలుగురు అక్కాచెల్లెళ్లే. పదేళ్ల వెంకటమ్మ, ఏడేళ్ల దివ్య, ఐదేళ్ల లావణ్య, మూడేళ్ల శైలజ. ఈ నలుగురికి నవారు అల్లే పని అప్పగించి బయటకు వెళ్లాడు దేవానంద్‌. వక్రంచి విధి మరోసారి ఆ అక్కాచెల్లెళ్లపై పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో తండ్రిని దూరం చేసింది. ఇంకేముందు ఆ నలుగురు అనాథలయ్యారు.

సరిగ్గా హెచ్ఎంటీవీ అక్కడే తన బాధ్యతను భుజానికెత్తుకుంది. బాబాయి వద్ద తలదాచుకుంటున్న నలుగురు అనాథలకు ఓ దారి చూపేందుకు తన వంతు ప్రయత్నం మొదలుపెట్టింది. జనవరిలో వీరి దీనస్థితిపై ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. రెండు గంటల పాటు ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించింది. తర్వాత ఏం జరిగింది.?

చిన్నారుల జీవితాల్లో వెలుగు నిండింది. అక్కాచెల్లెళ్ల దీనకథపై హెచ్‌ఎంటీవీలో ప్రత్యేక కథనాలు, ప్రత్యక్ష చర్చతో తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో దాతలు ముందుకు వచ్చారు. ఇంకేముంది ఆ నలుగురు అనాథ అక్కాచెల్లెళ్ల భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది. మలేషియాలో స్థిరపడ్డ మణికంఠ అనే దాత సహాయంతో ప్రస్తుతం అచ్చంపేటలోని ప్రైవేటు పాఠశాల హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. తాను పెరిగి పెద్దయి బాగా చదివి టీచర్‌ను అవుతానని ధీమాగా చెబుతుందిప్పుడు పెద్దపాప. పెద్ద పాప రెండోతరగతి, రెండో పాప యూకేజీ, మూడో పాప ఎల్‍కేజీ చదువుతుండగా, అందరిలోకి చిన్నదైన శైలజ ఇంకా స్కూల్‌లో చేరలేదు. వీరి బంగారు భవిష్యత్తు బాటలు వేసింది హెచ్ఎంటీవీయేనని, చిన్నారుల ఫీజులను మలేషియా నుంచి మణికంఠే పంపతున్నారని ప్రిన్సిపాల్‍ చెబుతున్నారు.

ఇక్కడే ఇంకో శుభవార్తను కూడా చెప్పుకోవాలి. చిన్నారుల దీనస్థితిని హెచ్‌ఎంటీవీలో చూసిన తల్లి లక్ష్మి కూడా తన పిల్లలను వెతుక్కుంటూ వచ్చింది. ప్రస్తుతం చిన్న పాప శైలజ తల్లి వద్దే ఉంటుంది. తమ పిల్లలు ప్రైవేట్‍ పాఠశాలలో చదువుకుంటున్నారని, వారిని పదో తరగతి వరకు దాతలు చదివిస్తే ఆపై ఉన్నత చదువులను చదివించుకుంటానని చెబుతుంది లక్ష్మీ. ఏమైనా నలుగురు అక్కాచెల్లెళ్లపై హెచ్‌ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలు, ప్రత్యక్ష చర్చలు వారి భవిష్యత్తులో కొత్త వెలుగులు నింపాయి. దాతలు స్పందించిన తీరు కూడా బంగారు భవితకు బాటలు వేసింది. చిన్నారులకు ఆపన్నహస్తం అందించిన ప్రతీ ఒక్కరికీ హెచ్‍ఎంటీవి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories