వైఎస్ జగన్‌పై దాడి కేసులో దాఖలైన వ్యాజ్యలపై నేడు హైకోర్టులో విచారణ ..

x
Highlights

గత నెల 26న విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి విచారణను థర్డ్‌ పార్టీకి అప్పగించాంటూ దా‌ఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు...

గత నెల 26న విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి విచారణను థర్డ్‌ పార్టీకి అప్పగించాంటూ దా‌ఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారించనుంది. కేసును రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని స్వతంత్ర సంస్ధతో దర్యాప్తు జరిపించేలా ఆదేశించాలని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గత నెల 30న హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో కేసు విచారణ పారదర్శకంగా జరగడం లేదంటూ వైసీపీకి చెందిన అమర్‌నాథ్‌రెడ్డి, అనీల్ కుమార్‌ యాదవ్‌లు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. వీటితో పాటు తనపై జరిగిన దాడిపై థర్డ్ ‌పార్టీతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ జగన్‌ కూడా కోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో విమానాశ్రయాల్లో భద్రతపై హైకోర్టులో మరో ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. వీటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు అన్ని పిటిషన్లను ఒకే సారి కలిపి విచారిస్తామంటూ ప్రకటించింది.

కేసు విచారణ సరైన కోణంలో జరగడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ప్రధానంగా డీజీపీ, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను వివరిస్తూ ధర్డ్ పార్టీ విచారణ కోరనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో తమ వాదన వినిపించిన నేతలు కోర్టులోనూ ఇదే వాదన వినిపించాలని భావిస్తున్నారు. కేసు విచారణను నిందితుడి వరకే పరిమితం చేయడం, పాత్రధారుల వెనకున్న సూత్రధారుల గురించి ఆలోచించకపోవడం, గంటల వ్యవధిలోనే నిందితుడికి తమ పార్టీతో ప్రమేయమున్నట్టు ఆధారాలు స్పష్టించడం ముందస్తు పథకం ప్రకారమే జరుగుతున్నాయనే వాదనను వినిపిస్తున్నారు.

వైసీపీ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టేలా ప్రభుత్వం తరుపు న్యాయవాదులు కూడా సిద్దమయ్యారు. ఇప్పటికే అన్ని పిటిషన్ల ఒకే సారి విచారించేలా వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ దాడి అనంతరం జరిగిన పరిణామాలను కోర్టుకు విన్నవించనున్నారు. సిట్ విచారణతో పాటు రిమాండ్ రిపోర్టు ఇతర అంశాలను ప్రస్తావించనున్నారు . ఓ వైపు కేసు విచారణ జరుగుతుండగానే జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు తరపున బెయిల్ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో పోలీసుల విచారణ పూర్తయినందున శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వాలంటూ సలీం అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు .దీంతో పాటు శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్ధితిపై కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు శుక్రవారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. తాజా పరిస్ధితుల నేపధ్యంలో ఇరు కేసులు కోర్టు గడపకు చేరడం ఉత్కంఠ రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories