జీఎంఆర్ సంస్థకు హరీష్ రావు సీరియస్ వార్నింగ్..!

x
Highlights

మంత్రి హరీష్ రావుకు కోపం వచ్చింది. మెదక్ జిల్లా తుప్రాన్ మండలం నాగులపల్లి వద్ద వెంటనే వంతెన పనులు చేపట్టకపోతే అక్కడకు దగ్గరలో ఉన్న జీఎమ్ ఆర్ టోల్ గేట్...

మంత్రి హరీష్ రావుకు కోపం వచ్చింది. మెదక్ జిల్లా తుప్రాన్ మండలం నాగులపల్లి వద్ద వెంటనే వంతెన పనులు చేపట్టకపోతే అక్కడకు దగ్గరలో ఉన్న జీఎమ్ ఆర్ టోల్ గేట్ ను ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు. మనోహరబాద్‌, కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి వెళ్లిన హరీశ్‌కు ఎంపీ ప్రభాకరరెడ్డి నాగులపల్లి వంతెన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. దాంతో ఈనెల 15 లోపు వంతెన పనులు చేపట్టక పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

మనోహరాబాద్ వరకూ జరుగుతున్న రైల్ ట్రాక్ పనులను మంత్రి హరీశ్‌రావు నిన్న పరిశీలించారు. సుమారు 3గంటల సేపు ధర్మారెడ్డిపల్లి, గిరిపల్లి, వీరనగరం, రెడ్యానాయక్‌ తండా, అప్పాయపల్లి, నాచారం తదితర గ్రామాల గుండా పర్యటించిన హరీశ్‌రావు రైల్వే ట్రాక్ పనులతోపాటు స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాగులపల్లి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారుల నిర్లక్ష్యం, నిధులు మంజూరైనా ఫ్లైవోవర్ నిర్మాణం చేపట్టకపోవడమే కారణమని తెలుసుకున్నారు. దీంతో టోల్‌గేట్ నిర్వాహకులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు.

తూఫ్రాన్ వద్ద టోల్‌గేట్‌ను జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తోంది. అక్కడ ఫ్లైవోవర్ నిర్మాణానికి 34కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది. టోల్ బాధ్యతలు చూస్తున్న జీఎంఆర్ సంస్థ ఆ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ, ఇంతవరకూ పనులు ప్రారంభించలేదు. దీంతో హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10రోజుల్లో ఫ్లైవోవర్ పనులు ప్రారంభించకుంటే టోల్‌ప్లాజాను నిలిపివేస్తామని హెచ్చరించారు.

తూఫ్రాన్ మండలం నాగులపల్లి వద్ద 44వ నెంబరు హైవేపై 4 చౌరస్తాలు ఉన్నా.. అక్కడ ఎలాంటి సిగ్నల్స్ గానీ, హెచ్చరిక బోర్డులు కానీ లేవు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నాగులపల్లి వద్ద 44వ నెంబరు హైవేపై గత పదేళ్లలో 287మంది మృతి చెందగా...408 మంది గాయపడ్డారు. ఒక్క నాగులపల్లి చౌరస్తాలోనే నాలుగేళ్ల కాలంలో 74 మంది మృత్యువాతపడ్డారు. నాగులపల్లి చౌరస్తాలో దాబాలు అధికంగా ఉండటంతో అక్కడ లారీలు ఆపడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, నిధులు మంజూరైనా ఫ్లైవోవర్ పనులు ప్రారంభించకపోడంతో మంత్రి హరీశ్ ఆగ్రహానికి గురయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories