జాతకంలో గ్రహసంచారం బాగా లేదని హెచ్చరించిన సిద్దాంతి

Submitted by arun on Thu, 08/30/2018 - 12:58

హరికృష్ణకు ఇదే తన చివరి ప్రయాణమని ముందే తెలిసిపోయిందా? రథసారథికి తన చివరి డ్రైవింగ్‌ అని ముందే అర్థమైపోయిందా? బుధవారం తెల్లారిజామున నెల్లూరు బయల్దేరే ముందు హరికృష్ణ ఎందుకామాట అన్నారు?

ఆపదలు చెప్పి రావు. కానీ ఆపద రాబోతుందన్న నిజం కొందరికి కొన్నిసార్లు తెలుస్తుంది. తనకు ప్రమాదం జరగబోతుందనో తనకు ఏదో ఆపద రాబోతోందనో అన్న ఆలోచన.. యథాలాపంగా చెప్పుకునే మాటలు కొన్ని సందర్భాలు నిజమవుతుంటాయి. దాన్నే సిక్త్‌సెన్స్‌‌గా చెప్పుకుంటాం. బహుశ నందమూరి హరికృష్ణకు అది తన లాస్ట్‌ జర్నీ ఇదేనన్న విషయం ముందే తెలిసిపోయినట్టుంది. 

మంగళవారం ఉదయం పదకొండు, పదకొండున్నర గంటల మధ్య ఆబిడ్స్‌లోని ఆహ్వానం హోటల్‌కు చేరుకున్నారు హరికృష్ణ. తనకు అత్యంత ఆప్తుడైన హోటల్‌ బాధ్యతలు చూసే కృష్ణారావు బుధవారం హాజరయ్యే శుభకార్యం కోసం షాపింగ్‌ చేశాడు. బుధవారం కావలికి వెళ్లాలని మూడు గంటలకే నిద్ర లేపాలని కృష్ణారావుకు చెప్పారు. అన్నట్టుగానే బుధవారం నాలుగు పదిహేను నుంచి నాలుగున్నర మధ్యలో ప్రయాణం మొదలైంది. 

కానీ అదే చివరి ప్రయాణం అవుతుందని హరికృష్ణ తప్ప మరెవరూ ఊహించలేకపోయారు. వాస్తవానికి హరికృష్ణ రెండు నెలలుగా అనారోగ్యపరమైన సమస్యలు వేధిస్తున్నాయన్నది ఆయనకు ఆప్తుడైన కృష్ణారావు మాట. దీనికి తోడు జాతకంలో గ్రహసంచారం బాగా లేదని, దూర ప్రయాణాలు మానుకోవాలని ఓ సిద్ధాంతి సూచించాడని చెబుతున్నాడు కృష్ణారావు. అప్పుటి నుంచి హరికృష్ణ ఏదో రకంగా ఉండేవాడని కన్నీటి పర్యంతమయ్యాడు కృష్ణారావు.

ఏమనిపించిందో, ఎందుకనిపించిందో కానీ హరికృష్ణ బుధవారం ప్రయాణ సమయంలో అనరాని మాట అన్నారు. అన్నట్టుగానే అనంత లోకాలకు తరలివెళ్లారు. డ్రైవర్‌ సీట్లో కూర్చుకుంటూ  కృష్ణా పెళ్లికి వెళ్తున్నాను.. మళ్లీ వస్తానో రానో తెలియదంటూ నవ్వుతూ వెళ్లి తమను దుఖసాగరంలో ముంచి వెళ్లాడని ఆహ్వానం సిబ్బంది బోరుమంటున్నారు.  

మాట వరసకు అంటారో మాటలు దొర్లి అంటారో కాలపురుషుడే అలా అనిపిస్తాడో తెలియదు కానీ హరికృష్ణ విషయంలో మాత్రం ఇది కచ్చితంగా సరిపోయిందని అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సెంటిమెంట్‌ని బలంగా నమ్మే హరికృష్ణ దేవుడిపై విపరీతమైన విశ్వాసంతో ఉండేవారట. ఎక్కడికి వెళ్లినా ముగ్గురితో కలిసి వెళ్లే వాడు కాదని, బుధవారం అలా మృత్యువు తీసుకెళ్లిందని స్నేహితులు, సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే జీవితమంటే కాలం ఆడించే కమ్మటి కావ్యం కావు.. కన్నీటి సాగరం. 

English Title
Harikrishna Words

MORE FROM AUTHOR

RELATED ARTICLES