తిరుమలలో రెచ్చిపోతున్న హాకర్లు

Submitted by admin on Wed, 12/13/2017 - 15:40

తిరుమలకు వెళ్లే భక్తులు కొండపైకి వెళ్లకుండానే నిలువు దోపిడీ సమర్పించుకోవాల్సి వస్తోంది. నడక మార్గంలో వచ్చే భక్తులే టార్గెట్ గా హాకర్లు రెచ్చిపోతున్నారు. ఓవైపు రాజకీయ పలుకుబడి, మరోవైపు రౌడీల అండదండలతో తిరుమల నడకమార్గాలు అనధికార హాకర్లకు నిలయంగా తయారైంది. నడక మార్గాలలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్థానికేతరులు మరియు స్థానికులు రెండు వర్గాలుగా విడిపోయి అనధికారికంగా వ్యాపారాలు చేస్తున్నారు. తరచూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతూ కాలిబాటలో భయందోళన సృష్టిస్తున్నారు.

నిత్యం వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించేందుకు గోవిందుడిని స్మరించుకుంటూ ప్రశాంతగా కొండపైకి ఎక్కుతుంటారు. ఈ క్రమంలో భక్తుల అవసరాల నిమిత్తం రెండు మార్గాల్లోనూ హాకర్లు తినుబండరాలు, శీతలపానీయాలు, పూజా సామగ్రిలతో పాటు ఆటబొమ్మల అమ్ముతున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా అక్రమవ్యాపారాలు చేస్తున్న హాకర్లు భక్తులను దొచుకుంటున్నారు. టీటీడీ నుండి ఏలాంటి గుర్తింపు లేకుండా వ్యాపారాలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ఓ పక్క స్థానికులు, మరో పక్క స్థానికేతరులు రెండువర్గాలుగా ఏర్పడి నడక మార్గాలలో వచ్చే భక్తులకు తినుబండారాలతో పాటు పూజాసామగ్రిలు  విక్రయించేంధుకు పోటీపడుతూ గొడవలకు దిగుతున్నారు. ఈ విషయంలో ఇటీవల రెండు ముఠాల ఘర్షణ పడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలువరు అనధికార హాకర్లను అరెస్టు చేశారు. దీంతో నిత్యం గోవింద నామ స్మరణలతో ప్రశాంతంగా ఉండే కాలిబాటలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంధి. పోలీసులు మాత్రం టీటీడీ అనుమతి ఉంటేనే వ్యాపారాలకు అనుమతిస్తామని, అనధికారికంగా వ్యాపారం చేస్తూ ఘర్షణలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

తిరుమలలో పుట్టిపెరిగిన తాము జీవనోపాధి కోసం 20ఏళ్లుగా కాలిబాటలో చిరువ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు.  అయితే టీటీడీ మాత్రం తమకు ఏలాంటి గుర్తింపు కార్డులు, లైసెన్స్ లు జారీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. రాజకీయనాయకుల అండదండలతో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు తమకు పోటీగా అక్రమవ్యాపారాలు ప్రారంభించారన్నారని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఏలాంటి నియంత్రణ లేకపోవడంతో చాలామంది హాకర్లు ముసుగులో నడకమార్గాల్లో అక్రమవ్యాపారాలు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు రేట్లకు అమ్ముతూ భక్తులను దోచుకుంటున్నారు. శ్రీవారి క్షేత్ర భద్రతను ధృష్టిలో వుంచుకొని టీటీడీ ఈ వ్యవహారం పై కీలక నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది. లేకపోతే హాకర్ల ముసుగులో ఎవరైనా అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే భారి మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా టీటీడీ అధికారులు రెండు వర్గాలను విచారించి  అనధికార వ్యాపాలకు చెక్ పెట్టాలని భక్తులు కోరుతున్నారు. 

English Title
hackers-mafia-tirumala

MORE FROM AUTHOR

RELATED ARTICLES