కొనసాగుతున్న పీఎం మోదీ హవా

కొనసాగుతున్న పీఎం మోదీ హవా
x
Highlights

బీజేపీ హవా మళ్లీ కొనసాగింది. గతంలో కన్నా మెజారిటీ తగ్గినా గుజరాత్ ను నిలబెట్టుకున్న బీజేపీ.. హిమాచల్ ప్రదేశ్ ను అదనంగా చేజిక్కించుకుంది. ఎగ్జిట్ పోల్...

బీజేపీ హవా మళ్లీ కొనసాగింది. గతంలో కన్నా మెజారిటీ తగ్గినా గుజరాత్ ను నిలబెట్టుకున్న బీజేపీ.. హిమాచల్ ప్రదేశ్ ను అదనంగా చేజిక్కించుకుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు బీజేపీకే పట్టం కట్టినా.. గుజరాత్ ఫలితాలు మాత్రం చివరిదాకా ఉత్కంఠ రేపాయి. 182 సీట్లున్న గుజరాత్ లో 99 సీట్లలో బీజేపీ జయకేతనం ఎగరేయగా... 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ లో 44 సీట్లు రాబట్టి అదనంగా మరో రాష్ట్రాన్ని ఖాతాలో వేసుకుంది.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. గుజరాత్ లో ఇప్పటికే అధికారంలో ఉన్న ఆ పార్టీ మళ్లీ తన పట్టు నిలుపుకోగా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోనూ జయకేతనం ఎగరేసింది. ఉదయం లెక్కింపు మొదలవగానే.. అనూహ్యంగా కాంగ్రెస్ ముందంజలో ఉండడం కనిపించింది. దీంతో అందరిలోనూ ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నాయి. అటు బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. దాదాపు లెక్కింపు మొదలైన 2 గంటల తరువాత.. 4వ రౌండ్ నుంచి బీజేపీ ఆధిక్య స్థానాల సంఖ్య పెరగడం ప్రారంభించింది. దీంతో ఆ పార్టీ నేతల్లో ఆనందం వ్యక్తమైంది. ఇక మధ్యాహ్నం నుంచి లెక్కింపు చివరిదాకా నువ్వా-నేనా అన్నట్టుగానే బీజేపీ-కాంగ్రెస్ హోరాహారీగా తలపడ్డాయి. దీంతో అటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆనందం వ్యక్తమైంది. మొత్తానికి 182 సీట్లున్న గుజరాత్ లో బీజేపీ మేజిక్ ఫిగర్ 92 ను దాటి 99 స్థానాల దగ్గర సెటిలైపోయింది. 115 స్థానాలకు గాను 16 సీట్లను బీజేపీ కోల్పోవాల్సి వచ్చింది. అటు కాంగ్రెస్ కు 2012లో 61 మంది ఎమ్మెల్యేలుండగా.. ఈ ఎన్నికల్లో 80 సీట్లకు ఎగబాకింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్.. ఈ ఫలితాలు తనకు నిరాశాజనకంగా ఏమీ లేవని, ప్రజాతీర్పును కాంగ్రెస్ స్వాగతిస్తోందని, రెండు రాష్ట్రాల్లోని నూతన ప్రభుత్వాలకు శుభాకాంక్షలు చెబుతున్నట్టు ట్వీట్ చేశారు. ఇక 68 సీట్లున్న హిమాచల్ లో బీజేపీ 44 సీట్లు గెల్చుకొని అధికార పీఠం అధిష్టించబోతోంది. గతంలో ఆ పార్టీ 26 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చుంది. ఇక 35 సీట్ల మేజిక్ ఫిగర్ ను దాటి 36 స్థానాలతో పవర్లో ఉన్న కాంగ్రెస్... ఈసారి 21 సీట్లకు పరిమితమై అధికార పీఠాన్ని బీజేపీకి అప్పగించింది.
ఈ ఎన్నికల్లో ఓట్లు బదిలీ అయిన క్రమం ఆసక్తికరంగా ఉండడం విశేషం. 2012తో పోలిస్తే.. ఈసారి బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకోగలిగాయి. 2012లో బీజేపీకి 47.85 శాతం ఓట్లు పోలవగా.. ఈసారి కడపటి వార్తలు అందేసరికి 54.4 శాతం ఓట్లు పోలైనట్టు రిపోర్టులు వచ్చాయి. అంటే.. బీజేపీ ఈసారి 6.75 శాతం ఓట్లను అదనంగా పెంచుకోగలిగింది. అటు కాంగ్రెస్ కూడా ఓట్ల శాతాన్ని పెంచుకోవడం విశేషం. 2012లో ఆ పార్టీకి 38.93 శాతం ఓట్లు పోలవగా.. ఈసారి 42.3 శాతం ఓట్లు బదిలీ అయ్యాయి. అంటే.. కాంగ్రెస్ 3.37 శాతం ఓట్లను అదనంగా పెంచుకోగలిగింది. ఇక ఇండిపెండెంట్లు, ఇతరులకు గతంలో 13.22 శాతం ఓట్లు రాగా.. ఈసారి అది గణనీయంగా తగ్గిపోయి కేవలం 3.3 శాతానికే పరిమితమైపోయింది. ఈ అంశమే.. గుజరాత్ ఫలితాల్లో అనూహ్యమైన ట్విస్ట్ ఇచ్చిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోగా.. కాంగ్రెస్ స్వల్పంగా నష్టపోయింది. బీజేపీకి గతంలో 38.47 శాతం ఓట్లు రాగా.. ఈసారి 64.7 శాతం ఓట్లను పెంచుకోగలిగింది. కాంగ్రెస్ కు గతంలో 42.81 శాతం ఉన్న ఓట్ల శాతం ఈసారి 30.9 శాతానికి పడిపోయింది. మరోవైపు ఇండిపెండెంట్లకు, ఇతరులకు గతంలో 18.72 శాతం ఓట్లు రాగా.. ఈసారి వారు 4.4 శాతానికే పరిమితమయ్యారు. మొత్తానికి బీజేపీ ఖాతాలో ఓ రాష్ట్రం చేరిపోగా.. కాంగ్రెస్ ఖాతా నుంచి మరో రాష్ట్రం చేజారిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories