పవన్ కల్యాణ్ అడ్డా మార్చేశారు!

Submitted by arun on Mon, 03/12/2018 - 13:29
Pawan Kalyan

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించినట్టే కనిపిస్తోంది. అజ్ఞాతవాసి తన చివరి సినిమా అని ఇప్పటికే క్లియర్ చేసిన పవన్.. చెప్పిన ప్రకారమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి అమరావతికి తన అడ్రస్ మార్చేస్తుండడం ఇందులో ప్రధానం కానుంది.

ఇన్నాళ్లూ కుటుంబంతో హైదరాబాద్ లోనే ఉంటున్న పవన్.. ఇప్పుడు మంగళగిరి దగ్గర సొంతిల్లు కట్టుకుంటున్నారు. కాజా అనే ప్రాంతంలోని మురుగన్ హోటల్ రోడ్డులో.. సాహితీ వెంచర్ లో ఈ ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. ఇవాళే ఆ ఇంటికి పవన్ భూమిపూజ కూడా చేశారు. ఈ పని కోసం నిన్న విజయవాడ వచ్చి ఓ ప్రైవేట్ హోటల్ లో ఉన్న పవన్.. చివరికి పని పూర్తి చేసుకున్నారు.

త్వరలో.. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించబోయే జనసేన ఆవిర్భావ సభ గురించి.. పార్టీ నేతలతో చర్చించారు. జన సమీకరణతో పాటు.. ఏర్పాట్ల విషయాలను సమీక్షించారు. అలాగే.. మన మహనీయులు స్ఫూర్తి ప్రదాతలు.. అందుకోండి మా ప్రణామాలు.. అంటూ తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో కూడిన ఓ వీడియోను.. జనసేన నేతలు విడుదల చేశారు.

ఇందులో ఏ అడుగు గమనించినా సరే.. రాజకీయాల్లోకి పవన్ పూర్తిగా.. స్పష్టంగా ప్రవేశించినట్టుగానే కనిపిస్తోంది. మరి ఆయన అడుగులు.. టీడీపీ వైపా.. ఇంకో పార్టీ వైపా.. సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్నది తేలాలంటే.. ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
 

English Title
Ground-breaking ceremony for Pawan Kalyan's new house

MORE FROM AUTHOR

RELATED ARTICLES