చెలరేగిన కార్చిచ్చు...మంటల్లో చిక్కుకొని 74 మంది దుర్మరణం

Submitted by arun on Wed, 07/25/2018 - 14:37
Greece wildfires

గ్రీస్ లో రగిలిన కార్చిచ్చు అడవులను, ఇండ్లను దహించి వేస్తోంది. అడవుల్లో చెలరేగిన మంటలు రాజథాని ఏథెన్స్ శివార్లకు కూడా వ్యాపించడంతో ఇప్పటికే  74 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు వెయ్యికి పైగా ఇండ్లు వందల సంఖ్యలో వాహనాలు కాలి బూడిదయ్యాయని అధికారులు తెలిపారు. మంటల నుంచి కాపాడుకోవడానికి ప్రజలు సముద్రం వద్దకు పరుగులు తీస్తున్నారు. అడవుల్లో రగిలిన ఈ కార్చిచ్చు మంగళవారం పట్టణాలకు వ్యాపించింది. దీంతో ఏథెన్స్ నగరానికి సమీపంలో సముద్ర తీరాన ఉన్న అనేక పట్టణాలు ఆహుతయ్యాయి. బీచ్‌లలో చిక్కుకుపోయిన పర్యాటకులను, దేశ పౌరులను రక్షించేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. 

కార్చిచ్చు కారణంగా అనేక ప్రాంతాల్లో మంటలకు కాలిపోయిన మనుషులు, పశువులు, జంతువుల మృతదేహాలను చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారని అన్నారు. మాటీ నగరంలోని ఓ విల్లాలో 26 మంది మరణించారని చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగవచ్చని అధికారులు పేర్కొన్నారు. వంద కిలోమీటర్ల వేగంగా వీస్తున్న ఈదురుగాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని చెప్పారు. మూడు వేర్వేరు ప్రాంతాలలో 15 చోట్ల ఒకేసారి మంటలు రాజుకున్నాయని ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఈ మంటల వ్యాప్తికి అంతర్జాతీయ సాయం కోరుతున్నారు. బాధితులను రక్షించడానికి హెలీకాప్టర్లు, నిపుణులైన అగ్నిమాపక సిబ్బందిని పంపాలని యూరోపియన్ దేశాలను గ్రీస్ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ఇటలీ, జర్మనీ, పోలండ్, ఫ్రాన్స్ దేశాలు తమవంతు సాయంగా కొన్ని విమానాలను, వాహనాలను, అగ్నిమాపక సిబ్బందిని పంపాయి.


 

English Title
Greece wildfires

MORE FROM AUTHOR

RELATED ARTICLES