పెళ్లి ఆపేందుకు నానమ్మ హత్య

Submitted by arun on Tue, 07/24/2018 - 15:15
grand mother, murder

మేడ్చల్‌ జిల్లా కీసరలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మానవతా విలువలు మరిచి సొంత మనవడే నాయనమ్మను మట్టుబెట్టినట్లు పోలీసులు తేల్చారు. తమ్ముడి పెళ్లిని ఆపేందుకే నిందితుడు శ్రీకాంత్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. 

నిందితుడు శ్రీకాంత్‌ చిన్న తమ్ముడు శ్రీహరికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఇంట్లో రెండు గదులే ఉండటం, ఇప్పటికే ఇద్దరు అన్నదమ్ములకు పెళ్లిళ్లయి ఉండటం ఇప్పుడు చిన్న తమ్ముడికి కూడా పెళ్లయితే తాను ఇంట్లోనుంచి బయటికి వెళ్లాల్సి వస్తుందనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతోన్న శ్రీకాంత్‌ అద్దె ఇంట్లోకి మారలేక సొంత నాయనమ్మను చంపితే ఏడాదిపాటు తమ్ముడి పెళ్లి చేయరనే ఉద్దేశంతోనే హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు.

నాయనమ్మను అంతమొందించాలని ముందే ప్లాన్‌ చేసుకొన్న శ్రీకాంత్‌ కీసరలో ఉంటోన్న తన మేనత్త ఇంటికి వెళ్లాడు. తన మేనత్త ఇంట్లో ఉంటోన్న నాయనమ్మను చంపేందుకు అదును కోసం చూశాడు. మేనత్త పని మీద బయటికి వెళ్లడంతో ఇంట్లో నిద్రపోతున్న నానమ్మను ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆభరణాల కోసమే దుండగులు హత్య చేశారని నమ్మించేందుకు వృద్ధురాలి చేతికి ఉన్న బంగారు గాజులతోపాటు మెడలో ఉన్న గోల్డ్ చైన్‌, చెవులకు ఉన్న వెండి ఆభరణాలను తీసుకొని వెళ్లిపోయాడు. 

నిందితుడు శ్రీకాంత్ గతంలో ఓ మహిళ హత్య కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి బయటికొచ్చినట్లు పోలీసులు తెలిపారు. 2011లో తాను పనిచేసే కంపెనీలో ఓ మహిళతో పరిచయం పెంచుకొన్న శ్రీకాంత్‌ ఆమెను చంపి బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సొంత నాయనమ్మనే దారుణంగా హత్య చేసిన శ్రీకాంత్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించారు.

English Title
grandmother murder for stops brother marriage

MORE FROM AUTHOR

RELATED ARTICLES