టీఆర్ఎస్‌ను వణికిస్తోన్న ఇసుక తుఫాన్

Submitted by arun on Tue, 01/09/2018 - 13:35
kcr

తెలంగాణలో ఇసుక వివాదం అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నేరెళ్ల ఘటన ముగియక ముందే కాంభాపూర్‌లో వీఆర్‌ఏ సాయిలు హత్య జరగడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ఇసుక  మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న అపవాదును మోయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఇసుక వివాదం టీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతోంది. ఇసుక మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో గులాబీ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక  అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందనే విమర్శలు తీవ్రమయ్యాయి. కేసీఆర్ సన్నిహితులకు ఇసుక మాఫియాతో సంబంధాలుండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అయితే, ప్రభుత్వం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తోంది. ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వేలకోట్ల ఆదాయం సమకూరిందని సమర్ధించుకుంటోంది. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం పరిధిలోని నేరెళ్లలో ఇసుక మాఫియా ఘాతుకానికి ఎంతో మంది బలైపోయారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు లారీకి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పోలీసులు స్థానికులను చితకబాదారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టారు. ఈ వ్యవహారంలో పోలీసుల తప్పులేదని ప్రభుత్వం సమర్థించుకున్నా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత కొంతకాలం ఇసుక మాఫియా సైలెంట్‌గా ఉన్నా.. మళ్లీ రెచ్చిపోతోంది. ప్రభుత్వం దీనిపై ఏమీ పట్టించుకోవడం లేదు. దీంతో వామపక్ష నేతలు, టీ.జేఏసీ చైర్మన్ కోదండరాం సిద్దిపేట నుంచి సిరిసిల్ల దాకా పాదయాత్ర చేపట్టారు.

అదే సమయంలో కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కాంభాపూర్ వీఆర్ఏ సాయిలు హత్య కలకలం రేపింది. అసలు సాయిలు వీఆర్ఏ కానేకాదని, అతనికి కాంభాపూర్‌తో సంబంధం లేదని మంత్రి కేటీఆర్ చెప్పడం ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టింది. సాయిలు వీఆర్‌ఏ కాకున్నా.. ఒక సామాన్య పౌరుడిగా ఇసుక మాఫియాను అడ్డుకుంటే ప్రాణాలు తీస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు వరుసగా బయటపడుతున్న ఇసుక మాఫియా ఆగడాలతో తెలంగాణ వ్యాప్తంగా పార్టీకి చెడ్డపేరు వస్తుందని అధికార పార్టీ నేతలు భయపడుతున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్, కేసీఆర్‌లకు చెబుదామంటే ధైర్యం చాలడం లేదని పలువురు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇసుక తుఫాన్ అధికార పార్టీని ముంచుతుందో, తేల్చుతుందో చూడాలి. 

English Title
Govt. encouraging sand mafia

MORE FROM AUTHOR

RELATED ARTICLES