గాలి ముద్దుకృష్ణమ వారసుని వేటలో గోల...రోజాకు దీటుగా వాణీ విశ్వనాథ్?

x
Highlights

చిత్తూరులో నగరి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దివంగత గాలి ముద్దుకృష్ణమ బతికున్నప్పుడు ఈ నియోజక వర్గాన్ని ఏలారు ఆయన మరణంతో గాలి ఇంట్లోనే వారసత్వ...

చిత్తూరులో నగరి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దివంగత గాలి ముద్దుకృష్ణమ బతికున్నప్పుడు ఈ నియోజక వర్గాన్ని ఏలారు ఆయన మరణంతో గాలి ఇంట్లోనే వారసత్వ పోరు రాజుకోవడం టిడిపి అధిష్టానాన్ని ఇరకాటంలో పడేసింది. నగరి సీటు నాదంటే నాదంటున్న గాలి వారసులను కాదని టిడిపి అధిష్టానం మరొకరికి కట్టబెడుతుందా? ఇప్పుడిదే అంశం అక్కడ హాట్ టాపిక్ గా మారింది.

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ప్రత్యేకించి చిత్తూరు రాజకీయాల్లో గాలి ముద్దు క్రిష్ణమ నాయుడికి ప్రత్యేక స్థానముంది. ఏ పార్టీలో కొనసాగినా నియోజక వర్గంలో ఆయనకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఎన్టీ ఆర్ స్పూర్తి, సహకారంతో రాజకీయాల్లోకి వచ్చిన గాలి ఎన్టీఆర్ మరణం తర్వాత లక్ష్మీ పార్వతి పార్టీలో, అక్కడి నుంచివైఎస్ ఆశీస్సులతో కాంగ్రెస్ లోనూ చేరి రాజకీయ మనుగడ సాగించారు. వైఎస్ మరణం తర్వాత గాలి ముద్దు కృష్ణమ మళ్లీ టిడిపి గూటికే చేరిపోయారు. రాజకీయ నేతగానే కాకుండా ఆత్మీయుడుగానూ జిల్లాలో ఆయనకు పేరుంది గాలి ముద్దు కృష్ణ మరణంతో అటు నియోజక వర్గం పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది. ఇక గాలి ఇంట్లో వారసుని ఎంపిక గొడవలకు దారితీస్తోంది. ముద్దు క్రిష్ణమ నాయుడుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. గాలి జగదీష్, గాలి భానుప్రకాష్ లు ఇతరత్రా వ్యాపారాలలో స్థిరపడినా రాజకీయాలపై ఇద్దరికీ ఆసక్తి వుంది. గతంలో గాలి జగదీష్ తండ్రితో కలసి రాజకీయాలలో పాల్గొనేవారు కానీ ఇప్పుడు భాను యాక్టివ్ గా మారారు ఇద్దరు కొడుకులూ రాజకీయాలపై ఆసక్తి చూపడంతో గాలి చంద్రబాబును కలసి ఇద్దరికీ అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ కుదరకపోవడంతో ఇద్దరికీ ఆయనే బ్రేకులేశారు.

నగరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ముద్దు కృష్ణమ వైసిపి అభ్యర్థి రోజా చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత కాలంలో అనారోగ్యానికి గురై కన్ను మూశారు ముద్దు అకాల మరణంతో తన వారసునిగా ఎవరిని ప్రకటిస్తారన్న అంశం ఎటూ తేలకుండా మిగిలిపోయింది. అయితే సమైక్యాంద్ర ఉద్యమం, గత ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న గాలి భానుకు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ మంచి సంబంధాలున్నాయి అదే సమయంలో గాలి రెండో కుమారుడు జగదీష్ కి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉంది. కొడుకులిద్దరి మధ్యా వారసత్వ పోరు రాజుకోవడంతో పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని ముద్దు సతీమణి గాలి సరస్వతమ్మకు కట్టబెట్టారు. అయితే ఆమె అనూహ్యంగా చిన్న కుమారుడిని వారసుడుగా ప్రకటించడం కుటుంబంలో పెద్ద రచ్చకు దారి తీసింది. గాలి జగదీష్ కు రాజకీయ నేపధ్యం కలిగిన కుటుంబంతో పెళ్లి కావడం ప్లస్ పాయింట్ గా మారింది. కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు కుమార్తెను జగదీష్ పెళ్ళి చేసుకున్నాడు. కానీ టిడిపి జిల్లా వ్యవహారాలపైనా, అగ్రనేతలతో సంబంధాల విషయంలోనూ ఇప్పటికీ భానూకే మంచి పట్టు ఉంది. మారుతున్న రాజకీయాల నేపధ్యంలో వైసిపి నేత రోజాకు దీటుగా సినీ నేపధ్యమున్న వాణీ విశ్వనాథ్ ను రంగంలోకి దింపుతారనీ కొన్నాళ్లక్రితం వార్తలొచ్చాయి. మరోవైపు నగరిలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గం రాజులు తమకే సీటు కేటాయించాలని టిడిపి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడిక ముద్దు క్రిష్ణమ లేని కారణంగా ఆ వర్గాలు మరింత ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయి. ఇక ముద్దు కృష్ణమ ఇంట్లో రేగిన రచ్చ చూశాక అధిష్టానం బయటి వ్యక్తులకే టిక్కెట్ కేటాయిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories