పంచ రాష్ట్రాల ఫలితాల నుంచి నేర్చుకోవాల్సిందేమిటి?

పంచ రాష్ట్రాల ఫలితాల నుంచి నేర్చుకోవాల్సిందేమిటి?
x
Highlights

సెమీ ఫైనల్స్ ముగిసిపోయాయి. ఇక అందరి దృష్టి రాబోయే లోక్ సభ ఎన్నికల పైనే ఉంది. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టి సరిగ్గా ఒక ఏడాది గడిచిపోయింది. ఈ...

సెమీ ఫైనల్స్ ముగిసిపోయాయి. ఇక అందరి దృష్టి రాబోయే లోక్ సభ ఎన్నికల పైనే ఉంది. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టి సరిగ్గా ఒక ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ఎంతో రాటుదేలారు ఆయన. సెమీఫైనల్స్ గా భావించిన ఎన్నికలు కాంగ్రెస్ కు విజయంతో పాటుగా మరెన్నో సవాళ్ళను అందించాయి. ఈ ఎన్నికల నుంచి బీజేపీ ఎన్నో పాఠాలు నేర్చుకొంది. మరో వైపున ఫ్రంట్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.

ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు రాష్ర్టాల్లో విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాలు కూడా హిందీ బెల్ట్ లోవే కావడం ఓ విశేషం. అదే సమయంలో మిజోరంను కోల్పోయింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోలేకపోయింది. ఇక బీజేపీ హిందీ బెల్ట్ లోని మూడు కీలక రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడమే గాకుండా తెలంగాణ, మిజోరంలలో కూడా ఒక్కొక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీ గానీ ఒంటరిగా బరిలోకి దిగి అత్యధిక స్థానాలు గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ ఫ్రంట్ రాజకీయాలు ఊపందుకున్నాయి. మరో వైపున నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఫ్రంట్ యత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ దేశ రాజకీయాలను ఒక అనిశ్చిత పరిస్థితి లోకి తీసుకెళ్తున్నాయి.

మూడు రాష్ట్రాల్లో సాధించిన విజయం కాంగ్రెస్ కు కొత్త ఊపిరిని అందించింది. అట్టడుగు స్థాయిలో కార్యకర్తలకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని అందించింది. రాబోయే ఎన్నికలకు వారు సన్నద్ధమయ్యేందుకు తోడ్పడింది. హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ అవుట్ అనే విమర్శకులకు కాంగ్రెస్ తన విజయాలతో సమాధానం ఇచ్చింది. ఈ విజయాలు హిందీ బెల్ట్ లోని ఇతర రాష్ట్రాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. జార్భండ్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ బలోపేతం అయ్యేందుకు తాజా విజయాలు దోహదం చేసే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి సైతం తాజా విజయాలు ఎంతో ధీమాను ఇచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ముందు వరకు కూడా కాంగ్రెస్ పరిస్థితి దీనంగానే ఉండింది. బీజేపీ వ్యతిరేక కూటమికి ఏ పార్టీ సారథ్యం వహిస్తుంది, ఏ పార్టీ నాయకుడు సారథ్యం వహిస్తాడు అనే ప్రశ్నలు తలెత్తాయి. అందుకు జవాబుగా ఎన్నో పార్టీల పేర్లు, మరెందరో విపక్ష నాయకుల పేర్లు కూడా వినిపించాయి. ఒక దశలో కాంగ్రెస్ సైతం ఆ కూటమికి మరెవరు నాయకత్వం వహించినా సరే అనే పరిస్థితి ఉండింది. తాజాగా ఈ పరిస్థితి మారింది. మహాకూటమి ఏర్పడే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించేందుకు కాంగ్రెస్ ను, రాహుల్ గాంధీని మిగితా వారు ఆమోదించే పరిస్థితి వచ్చింది. డీఎంకే అధినేత స్టాలిన్ ఇప్పటికే రాహుల్‌ను కూటమి తరఫున పీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు.మరో వైపున కాంగ్రెస్ లో అంతర్గతంగా రాహుల్ గాంధీ నాయకత్వం పటిష్ఠమయ్యేందుకు కూడా ఈ విజయాలు దోహదం చేశాయి. ఒక దశలో రాహుల్ కు ప్రత్యామ్నాయం కావాలన్న నాయకులు తాజా ఫలితాల నేపథ్యంలో ఇక ఆ వాదన వదులుకున్నారు.

మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో ఆ పార్టీ ఇచ్చిన ప్రజాకర్షక హామీలు కీలకపాత్ర వహించాయి. లోక్ సభ ఎన్నికలు వచ్చే లోగా ఆ హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడుతుంది. బీజేపీ చేతికి ప్రచారాస్త్రాలు ఇచ్చినట్లవుతుంది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతే ..... కాంగ్రెస్ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఖజానాలు ఖాళీగా ఉన్నాయి. అదే సందర్భంలో మరో నాలుగు నెలల్లోనే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దాంతో హామీల అమలు కాంగ్రెస్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories