ముంబై వర్లి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

Submitted by arun on Wed, 06/13/2018 - 17:33
Mumbai

దక్షిణ ముంబై వర్లి ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అబ్బాసాహేబ్‌ మరాఠే మార్గ్‌లో ఉన్న బ్లూమౌంట్‌ టవర్స్‌లోని 33వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో భవనంలోని పైరెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

ఈ భవనంలోనే కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్న అధికారులు మంటలను నియంత్రించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

మంటలు అంతకంతూ వ్యాపించాయి. తొలుత లెవల్‌ 2గా ఉన్న ప్రమాదం.. ఆ తర్వాత లెవల్‌ 3గా మారింది. 10 ఫైరింజన్లు, ఐదు జంబో ట్యాంకర్లు, 2 హైడ్రాలిక్‌ ప్లాట్‌ఫాంలు సహాయకచర్యల్లో పాల్గొన్నాయి. సహాయక సిబ్బంది 95 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్నప్పటికీ 33వ అంతస్తులో వ్యాపించిన మంటలు ఆర్పేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పక్కనే ఉన్న మరో టవర్‌పైకి చేరుకొని మంటల్ని పూర్తిగా అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గాలులు వీస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉండటంతో అవసరమైతే హెలీకాఫ్టర్‌ ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు. ఈ ప్రమాదంతో జనాలు రోడ్లపైకి రావడంతో చుట్టుపక్కల ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది.

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణే ఇదే అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. ఆమె ఫ్లాట్‌ 26వ అంతస్తులో ఉంది. అయితే ప్రమాదం సమయంలో ఆమె భవనంలో లేరని దీపిక పీఆర్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దీపిక ఇంట్లో లేరని... బ్రాండ్‌ షూటింగ్‌కు వెళ్లినట్టు చెప్పారు. అయితే ఆమె సిబ్బంది కొందరు ఫ్లాట్‌లోనే ఉన్నారు. వారంతా క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీపిక ఫ్లాట్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని  పీఆర్‌ బృందం మీడియాకు తెలిపింది. 

Tags
English Title
Fire breaks out in residential highrise in Mumbai's Worli

MORE FROM AUTHOR

RELATED ARTICLES