దూకుడు పెంచిన టీడీపీ

Submitted by arun on Sat, 03/10/2018 - 10:15
babu

కేంద్ర మంత్రుల రాజీనామాల తర్వాత టీడీపీ దూకుడు పెంచింది. మున్ముందు పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరిపిన చంద్రబాబు.. హోదా సాధనకు ఎలా ముందుకెళ్లాలన్నదానిపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నేతలందరితో దాదాపు రెండున్నర గంటలు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ వ్యూహ కమిటీ మరోసారి భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, లోకేశ్‌, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కేబినెట్  నుంచి మంత్రుల రాజీనామాలపై పార్టీ కీలక నేతల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 

తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్  నిర్వహించారు. రెండు జాతీయ పార్టీలూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాయని వారితో సీఎం చెప్పారు. కేంద్రమంత్రి పదవులకు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు రాజీనామాలు చేసిన నేపథ్యంలో నేతల స్పందనను చంద్రబాబు కోరగా.. అధిక శాతం నేతలు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అలాగే ప్రజల నుంచి కూడా సానుకూలమైన స్పందన వస్తోందని సీఎంకు వివరించినట్టు సమాచారం.

వ్యూహ కమిటీ భేటీలో భాగంగా సీఎం చంద్రబాబు 13 జిల్లాలకు చెందిన సుమారు 15వేల మంది నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు జాతీయ పార్టీలు ఏపీ ప్రజల మనోభావాలను అర్థంచేసుకోలేదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎంపీలు సమర్థంగా ఎండగడుతున్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక సాయం విషయాల్లో బీజేపీ మనకు అన్యాయం చేసిందని చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ మన కన్ను పొడవాలనుకుని తన రెండు కళ్లు పొడుచుకుందని రాష్ట్రానికి న్యాయం చేస్తుందనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని బాబు నేతలకి చెప్పారు. అయితే, బీజేపీ కూడా ఏపీకి అన్యాయం చేసిందని అన్నారు. రెండు జాతీయ పార్టీలు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించండని టెలీకాన్ఫరెన్స్ లో నేతలకు సూచించారు.

ఇంకా ఎన్డీయేలో కొనసాగడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సీఎం స్పందిస్తూ సందర్భానుసారం నిర్ణయాలు తీసుకుంటామన్నారు. విభజన హామీల సాధనలో కాలానుగుణంగా, అంచెలంచెలుగా కేంద్రంపై ఒత్తిడిని పెంచే భాగంగా మున్ముందు కీలక నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు నేతలతో అన్నట్టు సమాచారం.

English Title
Fighting Continue to AP Special Status | Chandrababu Guided Party leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES