ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎజెండా... రైతుబంధు పథకమేనా? ఇంతకీ అసలు కథేంటి?

Submitted by santosh on Mon, 05/07/2018 - 10:30
federal front raithubhandhu scheme

రైతుబంధు పథకంతో ఫెడరల్ ఫ్రంట్‌ను బలోపేతం చేసేందుకు పావులు కదుపుతున్నారు సీఎం కేసీఆర్. రైతులకు మేలు చేసే ఇలాంటి పథకాన్ని గతంలో అమలు చేయకపోవడం.. దేశవ్యాప్తంగా గుర్తింపు లభించడంతో దీనిని ప్రధాన ఎజెండా చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. దేశమంతా ఈ ప‌థ‌కం అమ‌లు చేసేందుకు ఫ్రంట్‌ను వేదిక‌గా చేసుకోవాల‌ని భావిస్తున్నారు గులాబీ నేత‌లు.

ఈ నెల 10 నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం రైతుబంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌బోతోంది. ఎక‌రాకు 8 వేల పెట్టుబ‌డి ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ఇత‌ర పార్టీల నేత‌లు, ఇత‌ర రాష్ట్రాల నేత‌లు సైతం రైతుబంధు ప‌థ‌కాన్ని అభినందించ‌టంతో ఈ ప‌థ‌కానికి దేశవ్యాప్త గుర్తింపు వ‌చ్చిన‌ట్లు టీఆర్ ఎస్ నేత‌లు భావిస్తున్నారు. దీంతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ నిర్మాణంలో రైతుబంధు ప్ర‌ధాన ఎజెండాగా ఉండే అవ‌కాశం ఉంది.

దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క‌మైన మార్పు కోసం ఒక ఫ్రంట్‌ ఏర్పాటు అవ‌స‌రాన్ని వివ‌రిస్తూనే.. 70 ఏళ్ళ పాల‌న‌లో రైతుల జీవితాలు ఎందుకు మార‌లేద‌నే అంశాన్ని జొప్పిస్తున్నారు కేసీఆర్‌. మొన్న స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాదవ్ హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇదే అంశంపై సుధీర్ఘ చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కు ఇత‌ర పార్టీల నేత‌లు మొగ్గు చూప‌టంలో రైతుల అంశమే కీలకపాత్ర పోషిస్తోంది.

రైతుబంధు పథకం ఇత‌ర రాష్ట్రాల నేత‌ల‌ను బాగా ఆకర్షిస్తోందని.. ప్రాంతీయ పార్టీల‌ను ఏకం చేయ‌టానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు గులాబీ నేత‌లు. దీంతో ఈ నెల 10న రైతుబంధు ప‌థ‌కం ప్రారంభ కార్య‌క్ర‌మానికి వివిధ రాష్ట్రాల నేత‌ల‌ను అహ్వానిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నేతలు వస్తే ఈ ప‌థ‌కానికి విస్తృత గుర్తింపు రావ‌టంతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కు కూడా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు వ‌స్తుంద‌ని భావిస్తున్నారు నేత‌లు.

English Title
federal front raithubhandhu scheme

MORE FROM AUTHOR

RELATED ARTICLES