కన్నతండ్రే కాలయముడయ్యాడు

x
Highlights

ఓ యువతికి కన్నతండ్రే కాలయముడయ్యాడు. కన్నకూతురని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 రోజులుగా గదిలో బంధించి నరకం...

ఓ యువతికి కన్నతండ్రే కాలయముడయ్యాడు. కన్నకూతురని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టాడు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 రోజులుగా గదిలో బంధించి నరకం చూపించాడు. తాగుబోతు తండ్రి టార్చర్ భరించలేక పోలీసులను ఆశ్రయించడంతో విముక్తి లభించింది
.

ఈడొచ్చిన కూతురన్న ఇంగితం లేదు. పరువు బజారున పడుతుందన్న బెంగా లేదు. తన పంతం నెగ్గించుకొనేందుకు మూడు వారాలపాటు గదిలో నిర్బంధించాడు. తన మాట వినడం లేదని తిండీ, నీళ్లు ఇవ్వలేదు. నోరు తెరిస్తే కుక్కని తన్నినట్టు తన్నులు. గదమాయింపులు. కనీసం పలకరింపుకు నోచని ఆ యువతి చుట్టూ అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలా సొంత ఇంట్లోనే పరాయిదైంది.

తిరుపతి బైరాగిపట్టెడ జయనగర్ కు చెందిన సుబ్రమణ్యం రెడ్డి అదో రకం. పెద్దపండగకి రమ్మని హైదరాబాద్ లో ఉన్న తన కూతురు శ్రావణికి కబురు పెట్టాడు. ఎప్పుడూ తండ్రి కాఠిన్యమే తప్ప ప్రేమ నిండిన పలకరింపు ఎరగని శ్రావణి ఆనందంతో ఇంటికి వచ్చింది. అంతే.. సుబ్రహ్మణ్యం రెడ్డిలోని అసలు మనిషి బయటికొచ్చాడు. వచ్చీరాగానే శ్రావణిని ఇంట్లో ఓ గదిలో బంధించాడు. మూడురోజులుగా తిండీతిప్పలు లేవు. కష్టం సుఖం చెప్పుకొనే దిక్కు లేకుండా పోయింది ఆ యువతికి. ఇంటికొచ్చిన కూతురుకి గృహనిర్బంధం, ఒంటరితనం శిక్షగా విధించాడు.

బి ఫార్మశీ పూర్తి చేసిన శ్రవణి హైదరాబాద్ లో పని చేస్తోంది. అక్కడ ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. అతనికి ప్రభుత్వోద్యోగం వచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే సంగతి తన అన్నకు చెప్పింది. కొడుకు ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుబ్రహ్మణ్యం రెడ్డిలోని కుల రాక్షసుడు నిద్ర లేచాడు. పరువు డ్యామేజవుతోందని రిపేర్ చేసేందుకు శ్రావణిని కల్లబొల్లి మాటలు చెప్పి ఇంటికి పిలిచాడు.

తనకు తెలిసిన వారికి ఇచ్చి వివాహం చేయడం కోసం శ్రావణిని నయానా భయానా ఒప్పించేందుకు చావగొట్టాడు.

మొదటి నుంచి తండ్రి చేతుల్లో చిత్రహింసలు అనుభవించిన శ్రావణి ఈ బాధలు తప్పించుకొనేందుకే ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు తెలిసింది. ఎప్పటిలాగే మద్యం తాగేందుకు వెళ్తూ సుబ్రహ్మణ్యం రెడ్డి ఫోన్ మరచి వెళ్ళడంతో శ్రావణి పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు యువతిని విడిపించి స్టేషను కు తీసుకెళ్లారు. తల్లితండ్రులను విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories