కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం

కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం
x
Highlights

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రీయ కిసాన్‌ మంచ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న.. రైతుల ఆందోళన నాలుగో రోజుకు చేరింది. ఉద్యమంలో భాగంగా పట్టణాలకు కూరగాయల...

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రీయ కిసాన్‌ మంచ్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న.. రైతుల ఆందోళన నాలుగో రోజుకు చేరింది. ఉద్యమంలో భాగంగా పట్టణాలకు కూరగాయల సరఫరా నిలిపివేయడంతో వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. ఈనెల 1 నుంచి జరుగుతున్న గావ్ బంద్ లో భాగంగా పలు చోట్ల రైతులు పాలు, కూరగాయల సరఫరాను నిలిపివేశారు. పంజాబ్‌, హరియాణాల్లో రైతులు రహదారులపై కూరగాయలను పారబోసి నిరసన తెలిపారు.

గ్రామాల నుంచి పాలు, కూరగాయలు బంద్‌ కావడంతో.. ఆ రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. పంజాబ్‌, హరియాణాల్లో కూరగాయల ధరలు కిలోకి 10 రూపాయిల నుంచి 20 రూపాయిలకు పెరిగిపోయాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ తో పాటు పలు ప్రాంతాల్లో కూరగాయల ధరలు 25 నుంచి 30 శాతం పెరిగాయి. రైతుల ఆందోళనతో మార్కెట్లకు 20 శాతానికి మించి కూరగాయలు రావడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే హర్యానాలోని అంబాలా సిటీలోని వితా మిల్క్ ప్లాంట్‌కు పాల సరఫరా కష్టతరంగా మారుతుందంటున్నారు.

దేశవ్యాప్తంగా వందకు పైగా రైతుసంఘాలు కిసాన్‌ మహాసంఘగా ఏర్పడి.. రుణమాఫీ, మద్దతుధర పెంపు డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టాయి. గతంలా కాకుండా ఈ సారి గావ్‌ బంద్‌కు పిలుపునిస్తూ.. పది రోజుల పాటు పట్టణాలు, నగరాలకు పాలు, కూరగాయలను సరఫరా చేయొద్దని రైతులను మహాసంఘ్‌ కోరింది. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, హరియాణాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు.

ప్రచారం కోసమే రైతులు ఆందోళనలకు దిగుతున్నారంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కడుపు మండి రోడ్డెక్కితే ప్రచారమంటారా.. అంటూ రైతులు మండిపడ్డారు. రాధామోహన్‌సింగ్‌ను తక్షణం పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల సమ్మెకు అర్ధం లేదని హరియాణా సీఎం ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు నేతలు, ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని రైతు సంఘాల నేతలు తెలిపారు.

తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని దేశవ్యాప్తంగా రైతన్నలు కదంతొక్కారు. దేశవ్యాప్తంగా అన్నదాతలు గావ్ బంద్ ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 10న భారత్ బంద్ నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. మరోవైపు, ఇలాంటి ఆందోళనల వల్ల సాధించేదేమీ ఉండదని హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చెప్పారు. మార్కెట్‌కు వెళ్లే రైతుల్ని అడ్డుకుంటున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories