కన్నడ నాట ఎగ్జిట్‌పోల్స్‌ ఏం చెబుతున్నాయి?

కన్నడ నాట ఎగ్జిట్‌పోల్స్‌ ఏం చెబుతున్నాయి?
x
Highlights

ఒపీనియన్‌ పోల్స్‌ ఊహించినట్టే, ఎగ్జిట్‌పోల్స్‌ కూడా కర్ణాటకలో హంగ్‌ తప్పదని తేల్చేశాయి. మెజారిటీ సంస్థలు, జాతీయ ఛానెళ్లు మిశ్రమ ఫలితాలకే ఓటేశాయి....

ఒపీనియన్‌ పోల్స్‌ ఊహించినట్టే, ఎగ్జిట్‌పోల్స్‌ కూడా కర్ణాటకలో హంగ్‌ తప్పదని తేల్చేశాయి. మెజారిటీ సంస్థలు, జాతీయ ఛానెళ్లు మిశ్రమ ఫలితాలకే ఓటేశాయి. ఇండియా టుడే ఛానెల్ మాత్రం బోటాబోటీ మెజారిటీతో కాంగ్రెస్‌ గట్టెక్కుతుందని అంచనా వేస్తే, రిపబ్లిక్‌ టీవీ, స్వల్ప మెజారిటీతో బీజేపీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తోంది. దాదాపు మిగతా సంస్థలన్నీ హంగ్‌కే ఓటేసినా, కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయమని తేల్చాయి. ఒకవేళ ఎగ్జిట్‌పోల్స్‌ నిజమైతే, జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడది బీజేపీ వైపు మొగ్గు చూపుతుందన్న అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఇంతకీ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలేంటి?

కర్ణాటక అసెంబ్లీలో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జాతీయ ఛానెల్స్‌ అన్నీ ఎగ్టిట్‌పోల్స్ సర్వేలు నిర్వహించాయి. ఇండియా టుడే పోల్‌, కాంగ్రెస్‌కు పట్టం కట్టింది. 106 నుంచి 118 వరకు కాంగ్రెస్‌‌కు సీట్లు వస్తాయని లెక్కలేసింది. 79 నుంచి 92 స్థానాలతో బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. జేడీఎస్‌కు 22 నుంచి 30 సీట్లు వస్తాయని తెలిపింది. ఇతరులు ఒకటి నుంచి 4 సీట్లు వచ్చే ఛాన్స్‌ ఉందని అంచనా వేసింది.

టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌పోల్‌ హంగ్‌కు ఓటేసింది. అయినా కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. బీజేపీకి 80-93, కాంగ్రెస్‌కు 90-103, జేడీఎస్ 31-39, ఇతరులు 2-4 సీట్లు గెలుస్తారని భావిస్తోంది. ఇక రిపబ్లిక్‌ టీవీ మాత్రం, బీజేపీ జైత్ర యాత్ర కొనసాగుతుందని అంచనా వేస్తోంది. బీజేపీ 95-114, కాంగ్రెస్ 73-82, జేడీఎస్ 32-43 సీట్లు వస్తాయని తెలిపింది.

ఇక మరో జాతీయ ఛానెల్, ఇండియా టీవీ కూడా, కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ తప్పదంటోంది. బీజేపీ 87, కాంగ్రెస్ 97, జేడీఎస్ 35, ఇతరులు 3. హిందీ ఛానెల్, ఏబీపీ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేస్తోంది. బీజేపీ 107, కాంగ్రెస్ 88, జేడీఎస్ 25, ఇతరులు 4, న్యూస్‌ ఎక్స్ ఛానెల్. బీజేపీ 103, కాంగ్రెస్ 93, జేడీఎస్ 25, ఇతరులు 3.

మొత్తానికి ఎగ్జిట్‌ పోల్స్‌ మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. కొన్ని సంస్థలు, కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని జోస్యం చెబితే, మరికొన్ని బీజేపీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా తేల్చాయి. అన్ని ఎగ్జిట్‌పోల్స్‌లోనూ, జేడీఎస్‌కు దక్కింది మూడో స్థానమే. కానీ ఇదే రీతిలో మే 15న హంగ్‌ ఫలితాలు వస్తే, మాత్రం మూడో స్థానంలో నిలిచిన జేడీఎస్సే కీలక పాత్ర పోషిస్తుంది. అది బీజేపీ వైపు తూగుతుందా, కాంగ్రెస్‌ వైపు నిలుస్తుందా అనే విషయంపైనే ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉంది.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలైనా రెండు సీట్లకు ఎన్నికలు జరగలేదు. 222 స్థానాలకే పోల్స్ జరిగాయి. ఈ లెక్కన 222 స్థానాలనే పరిగణలోకి తీసుకుంటే, ప్రభుత్వం స్థాపించడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్ 112. ఇండియా టుడే, మ్యాజిక్‌ ఫిగర్ కంటే, కాంగ్రెస్‌ ఆరు స్థానాలే ఎక్కువే గెలుస్తుందని అంచనా వేసింది. అంటే 118. ఇక రిపబ్లిక్‌ టీవీ మాత్రం బీజేపీకి 114 స్థానాలని అంచనా వేసింది.

మొత్తానికి కర్ణాటక ఓటర్ల నాడి అంతుపట్టడంలేదని వివిధ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌ను బట్టి అర్థమవుతోంది. హంగ్‌ అని కొన్ని సంస్థలు, కాంగ్రెస్‌ అని కొన్ని, బీజేపీ అని మరికొన్ని అంచనా వేశాయి. కానీ మే 15 అంటే మంగళవారం, జనం ఎవరికి శుభం మంగళం పలికారో తేలిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories