డీ ఎల్ దారెటు...టికెట్ ఇచ్చేందుకు రెడీ అంటున్న...

డీ ఎల్ దారెటు...టికెట్ ఇచ్చేందుకు రెడీ అంటున్న...
x
Highlights

కనుచూపుతో ఉమ్మడి ఏపీ రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి భవిష్యత్ రాజకీయాలపై సమాలోచనలు చేస్తున్నారు . మూడు రోడ్ల కూడలిలో నిలబడి ఎటు...

కనుచూపుతో ఉమ్మడి ఏపీ రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి భవిష్యత్ రాజకీయాలపై సమాలోచనలు చేస్తున్నారు . మూడు రోడ్ల కూడలిలో నిలబడి ఎటు వైపు వెళ్లాలో ఆలోచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఏ పార్టీ తరపున ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీల వారిగా ఆఫర్లు బేరీజు వేసుకుంటూ రేపటి కోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు .

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డికి పెద్ద చిక్కు వచ్చి పడింది. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన చేతిని విడిచి పెట్ట వద్దంటూ కాంగ్రెస్ కోరుతుంటే ఫ్యాన్ గాలిలో సేద తీరాంటూ వైసీపీ కోరుతోంది. ఇక అధికార టీడీపీ అయితే సైకిల్ సవారి చేస్తే అటు ఆరోగ్యం, ఇటు అధికారం వెంట వస్తాయంటూ ఊరిస్తోంది. దీంతో ఎటు వెళ్లాలో తెలియక డీఎల్ తికమక పడుతున్నారు.

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు నియోజకవర్గం నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లలో మంత్రిగా పనిచేశారు. కిరణ్ హయంలో ముఖ్యమంత్రి నిర్ణయాలతో తీవ్రంగా విభేదించి భర్తరఫ్‌కు గురయ్యారు. వైసీపీ ఆవిర్బావం అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కడప కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహాన్ రెడ్డిపై ఎంపిగా పోటీ చేసి డిపాజిట్‌ లాస్ అభ్యర్ధిగా గుర్తింపు పొందారు.

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రాజకీయ మార్పుల్లో నాలుగేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ప్రజా నాయకుడిగా ఉన్న డీఎల్ తమ పార్టీలో ఉంటే గెలుపు సునాయాసం అని భావించిన వైసీపీ, టీడీపీలు తమతమ పార్టీలోకి ఆహ్వానం పలికాయి. టీడీపీ అయితే ఏకంగా మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్‌ను టీటీడీ ఛైర్మన్‌గా చేసి డీఎల్‌కు మార్గం సుగమం చేసింది. ఇక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రఘురామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామంటూ హామి డీఎల్‌ను పార్టీలోకి రావాలంటూ కోరింది. అయితే రెండు పార్టీల ఆఫర్లను అటు అంగీకరించకుండా ఇటు తిరస్కరించకుండా హోల్డ్‌లో పెట్టిన డీఎల్‌కు మరో బంపర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కర్నాటక కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర స్ధాయిలో కీలక పదవితో పాటు పలు తాయిలాలు ప్రకటించారు.

మూడు పార్టీలు ఇచ్చిన ఆఫర్లపై లెక్కలు వేసుకున్న డీఎల్ తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో కాంగ్రెస్‌లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నా కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఇదే పార్టీలో ఉండటంతో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నట్టు సమాచారం. టీడీపీ, వైసీపీల్లో తనకు ఎవరు పూర్తి స్ధాయిలో మద్ధతు ఇస్తే అందులోనే చేరాలని భావిస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎవరి షేక్ హ్యాండిస్తారో ఎవరి హ్యాండ్ షేక్ చేస్తారోననే ఆసక్తి మూడు పార్టీలో పాటు జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories