పౌరులకే కాదు ఇళ్లకూ ఆధార్..‌‌! రాజధానిలో ఇంటికో యూనిక్‌ ఐడీ

పౌరులకే కాదు ఇళ్లకూ ఆధార్..‌‌! రాజధానిలో ఇంటికో యూనిక్‌ ఐడీ
x
Highlights

ఆధార్‌..వ్యక్తులకు సంబంధించిన చిరునామాలతోపాటు బ్యాంకులు, సిమ్‌కార్డులు, రేషన్‌కార్డులు, ఓటరు కార్డు, పాన్‌ నంబర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పనికీ ...

ఆధార్‌..వ్యక్తులకు సంబంధించిన చిరునామాలతోపాటు బ్యాంకులు, సిమ్‌కార్డులు, రేషన్‌కార్డులు, ఓటరు కార్డు, పాన్‌ నంబర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పనికీ ‘ఆధార్‌’ అవసరం తెలిసిందే. ఇది మనుషులకు కాగా ఇళ్లకూ ‘ఆధార్‌’ తరహా నంబర్లిచ్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. సకల జనుల సమగ్ర సర్వే, సమగ్ర నేరస్థుల సర్వే, భూరికార్డుల ప్రక్షాళన వంటి కార్యక్రమాలతో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఆధార్‌ కార్డు తరహాలోనే ప్రతి ఇంటికీ, ప్రతి ప్లాట్‌కి ఒక యూనిక్‌ ఐడీ నెంబర్‌ కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. ముందుగా హైదరాబాద్‌ మహానగరంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇప్పటికే మూసాపేటలో సర్వే ప్రారంభించిన జీహెచ్ఎంసీ బృందం.... ప్రతి ఇంటికీ, ప్రతి ప్లాట్‌కీ, ప్రతి స్థలానికీ డిజిటల్‌ డోర్‌ నెంబర్‌ కేటాయించే పనిలో నిమగ్నమయ్యారు.

యూనిక్‌ ఐడీ నెంబర్‌‌నే డిజిటల్‌ డోర్‌ నెంబర్‌గా గుర్తిస్తారు. దీన్నే ప్రాపర్టీ ఆధార్‌ నెంబర్‌‌గా కూడా వ్యవహరిస్తారు. యూనిక్‌ ఐడీ కేటాయింపుతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రతి ఇల్లు, ప్లాట్‌, ఖాళీ స్థలం, నిర్మాణం పూర్తయిన భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలు.... ఇలా ప్రతీ ప్రాపర్టీ ఈ డిజిటల్‌ డోర్‌ నంబర్‌ ద్వారానే ఇల్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ తదితర వివరాలన్నీ తెలుస్తాయి. ఒక డిజిటల్‌ డోర్‌ (ఆధార్‌)నంబర్‌ను కేటాయించారంటే దానికి సంబంధించిన స్థలం ఎవరి పేరు మీద ఉంది.. ఒకరి నుంచి ఒకరికి మ్యుటేషన్‌ జరిగిందా.. వంటి వివరాలతోపాటు ఆ ఇంటి ఆస్తిపన్ను గుర్తింపు నంబర్‌( పీటీఐఎన్‌), నివాస భవనమా, వాణిజ్య భవనమా, వేకెంట్‌ ల్యాండా వంటి వివరాలు ఆన్‌లైన్‌ ద్వారానే తెలుసుకునే వీలుంటుంది.

అంతే కాదు సంబంధిత ఇంటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌(ఓసీ) జారీ అయిందా లేదా వంటివి కూడా తెలుస్తాయి. ఇది ప్రజలకుపకరించే అంశం కాగా.. ఇళ్ల ఆధార్‌ నంబర్ల ద్వారా ఆస్తిపన్ను చెల్లించారా..లేదా? చెల్లించకుంటే ఎంతకాలంగా చెల్లించడం లేదు..? రికార్డుల్లో మాత్రం నివాస భవనంగా ఉన్నప్పటికీ, వాస్తవంగా వాణిజ్యం నిర్వహిస్తున్నారా.. తదితర వివరాలు జీహెచ్‌ఎంసీకి తెలుస్తాయి. అంతేకాదు.. ఇంతవరకు ఓసీలు తీసుకోని, ఆస్తిపన్ను చెల్లించని ఇళ్ల వివరాలు కూడా తెలుస్తాయి. వీటిని గుర్తించి ఆస్తిపన్ను, ట్రేడ్‌ లైసెన్సులు, ఇతరత్రా ఫీజులు వసూలు చేయడం ద్వారా జీహెచ్‌ఎంసీకి కనిష్టంగా ఏటా దాదాపు రూ.150 కోట్ల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే మేరకు జీహెచ్‌ఎంసీలో దాదాపు 20 లక్షల ఇళ్తుండగా, ఆస్తిపన్ను జాబితాలో మాత్రం 14 లక్షలే ఉన్నాయి. సర్వే అనంతరం దాదాపు 70 వేల ఇళ్లు కొత్తగా వచ్చి ఉంటాయని అంచనా. వీటన్నింటినీ ఆస్తిపన్ను పరిధిలోకి తెస్తారు. ట్రేడ్‌ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి ట్రేడ్‌లైసెన్సులుజారీ చేస్తారు. తద్వారా జీహెచ్‌ఎంసీ ఆదాయం పెరుగుతుంది.

ఈ డిజిటల్‌ డోర్‌నంబర్‌(ఆధార్‌) కోసం పైలట్‌ ప్రాజెక్టుగా మూసాపేట సర్కిల్‌లో బుధవారం సర్వేకు శ్రీకారం చుట్టారు. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) సహకారంతో శాటిలైట్‌ చిత్రాల మ్యాపింగ్‌తో జీహెచ్‌ఎంసీ ఐటీ, రెవెన్యూ విభాగాలు ఈ సర్వే నిర్వహిస్తున్నాయి. మూసాపేట సర్కిల్‌లో దాదాపు 60 వేల ఇళ్లున్నట్లు అంచనా. వీటన్నింటి సర్వే రెండు నెలల్లో పూర్తవుతుందని, అడిషనల్‌ కమిషనర్‌ (ఐటీ) ముషార్రఫ్‌ ఫారూఖి తెలిపారు. అవసరాలకనుగుణంగా ఆరు నుంచి ఎనిమిది డిజిట్‌లతో ఇళ్ల ఆధార్‌ నంబర్‌లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నంబర్‌ ఉంటే సెల్‌ఫోన్‌తోనే కావాల్సిన చిరునామాకు నేరుగా వెళ్లిపోవచ్చునని చెప్పారు. ఫైర్‌సర్వీసెస్, పోస్టల్, కొరియర్‌ సర్వీసులకు ఎంతో ఉపయుక్తమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories