కుక్క చనిపోతే ఊరుఊరంతా శ్రద్ధాంజలి బ్యానర్లు కట్టారు!

Submitted by lakshman on Wed, 09/13/2017 - 20:33

కేరళ: రోడ్డు మీద ఒక శవం కనిపిస్తేనే మనకెందుకొచ్చిందిలే అని దులిపేసుకుపోతున్న రోజులివి. అలాంటిది ఓ వీధి కుక్క చనిపోతే ఊరుఊరంతా శోకసంద్రంలో మునిగిపోవడం ఈరోజుల్లో వింతే. అలాంటి వింత ఘటనే కేరళలోని కుంజిపల్లి గ్రామంలో జరిగింది. సెప్టెంబర్ 8న ఈ ఊళ్లో ఓ వీధికుక్కను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. వీధికుక్క అంటే ఈ గ్రామస్తులు కోపగించుకుంటారు. దాని పేరు అలీ అప్పు. ఒక వీధికుక్కపై ఎందుకంత ప్రేమని అడిగితే ఆ ఊరి జనం చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ కుక్క ఎనిమిది సంవత్సరాల క్రితం తమ ఊరికి వచ్చిందని, గ్రామస్తుల్లో ఎవరో దానికి అలిఅప్పు అని పేరు పెట్టారని స్థానికుల్లో ఒకరు చెప్పారు. తమ గ్రామంలో అడుగుపెట్టాలంటేనే దొంగలు భయపడేవారని.. వీధుల్లో తిరుగుతూ అంతలా ప్రతీ ఇంటికీ అప్పు కాపలాగా ఉండేదని అతను చెప్పాడు. ఊళ్లో పెళ్లైనా, చావైనా అప్పు కచ్చితంగా రావాల్సిందేనని.. ఒకవేళ లేకపోయినా.. తీసుకొచ్చేవారని తెలిపాడు.

కుంజిపల్లిలో ఏ ఒక్కరికీ అప్పు హాని తలపెట్టలేదని చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్ 8న కొందరు గిట్టని వ్యక్తులు కావాలనే అప్పును దారుణంగా హత్య చేశారని.. వారిని దేవుడు కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. సెప్టెంబర్ 5న అప్పు గొంతును ఎవరో గాయపరిచారని.. చికిత్స కూడా చేయించామని.. ఇంతలోనే ఇలా జరిగిందని కుంజిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు అంత్యక్రియలకు గ్రామంలోని చాలామంది ప్రజలు హాజరయ్యారు. తుది వీడ్కోలు పలికారు. ఈ విషయం తెలిసిన వాళ్లంతా విశ్వాసంలో మనుషుల కంటే కుక్కలే నయమని.. గ్రామస్తులకు అప్పు చేసిన సేవ.. వారు చూపించిన ప్రేమ వెలకట్టలేనిదని అంటున్నారు.

English Title
Entire village shows invaluable love of street dog

MORE FROM AUTHOR

RELATED ARTICLES