అంతరిక్ష ప్రయోగాల్లో స్పేస్ ఎక్స్ చరిత్ర...అంతరిక్షంలోకి కారును పంపిన స్పేస్ ఎక్స్

అంతరిక్ష ప్రయోగాల్లో స్పేస్ ఎక్స్ చరిత్ర...అంతరిక్షంలోకి కారును పంపిన స్పేస్ ఎక్స్
x
Highlights

అంతరిక్ష పరిశోధనలు మరో మలుపు తిరిగాయి. ఇన్నాళ్లూ మూగజీవాలు.. ఆ తర్వాత వ్యోమగాములు వెళ్లిన స్పేస్ లోకి.. తొలిసారిగా ఓ కారును పంపించారు. ప్రైవేటు...

అంతరిక్ష పరిశోధనలు మరో మలుపు తిరిగాయి. ఇన్నాళ్లూ మూగజీవాలు.. ఆ తర్వాత వ్యోమగాములు వెళ్లిన స్పేస్ లోకి.. తొలిసారిగా ఓ కారును పంపించారు. ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకేట‌్ ఫాల్కన‌్ హెవీ ద్వారా.. టెస్లా రోడ్ స్టర‌్ మోడల్ కారును అంతరిక్షంలోకి పంపించింది. నాసా కీలక ప్రయోగాలకు వేదికైన కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచే ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. అయితే కారును నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో మాత్రం విఫలమయ్యారు.

ప్రపంచంలో పేరుగాంచిన అంతరిక్ష పరిశోధనా సంస్థలకు సాధ్యంకాని ప్రయోగాన్ని.. ఓ ప్రైవేట్‌ సంస్థ సుసాధ్యం చేసింది. ఏకంగా అంతరిక్షంలోకి.. అత్యంత శక్తివంతమైన రాకెట్ ను ప్రయోగించడమే కాకుండా.. ఓ కారును పంపించి చరిత్ర స్రుష్టించింది. ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌లోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి మంగళవారం ఫాల్కన‌్ హెవీ రాకెట్‌.. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 1969 లో చంద్రుడి మీదకు తొలిసారి మానవులను పంపడం నుంచి నాసా కీలక ప్రయోగాలకు సాక్ష్యంగా నిలిచిన కెన్నడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని 39 ఏ ప్రయోగ వేదిక నుంచే దీన్నీ ప్రయోగించారు.

18 వేల 747 జెట్‌ లైనర్ల వేగంతో దూసుకెళ్లిన ఫాల్కన్‌ హెవీ రాకెట్‌.. టెస్లా రోడ్ స్టర‌్ మోడల్ కారును.. అంగారకుడి కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే తొలుత ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు, స్పేస్ ఎక్స్ సంస్థ ప్రతినిధులు భావించారు. కానీ ఫాల్కన్‌ హెవీ రాకెట్‌.. కారును ప్రవేశపెట్టాల్సిన నిర్ణీత కక్ష్యలో కాకుండా.. అంగారకుడి అవతల ఆస్టరాయిడ్‌ ప్రభావిత ప్రాంతంలో.. విడిచిపెట్టిందని సంస్థ ప్రకటించింది. అంగారకుడి కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టి.. సూర్యుడి చుట్టూ తిరిగేలా చేయాలని భావించారు. అయితే మూడోసారి ఇంధనాన్ని మండించే ప్రక్రియలో.. కారు అనుకున్నదాని కన్నా ముందుకు వెళ్లింది. దీంతో అంగారకుడు, బృహస్పతి మధ్యలో ఉన్న.. గ్రహశకలాల వరుస వైపుగా ఆ కారు పయనిస్తోంది. ఇది అంతరిక్షంలో ఎన్నిరోజులు మనుగడలో ఉంటుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ ఆ కారు.. సౌరవ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశిస్తే.. సూర్యుడి కాస్మిక్‌ కిరణాలు తగిలి కారు ముక్కలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కారుకు మూడు కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటి దృశ్యాలను ప్రత్యక్షప్రసారం చేశారు. కారు డ్రైవర్‌ సీటులో వ్యోమగామి బొమ్మను కూర్చోబెట్టారు.

స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ తయారు చేసిన ఫాల్కన్‌ హెవీ ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఫాల్కన్‌ హెవీలో 27 రాకెట్‌ ఇంజిన్లు ఉన్నాయి. ప్రయోగ సమయంలో ఇవి 5 లక్షల పౌండ్ల శక్తిని వెలువరించాయి. ప్రస్తుతం స్పేస్‌ ఎక్స్‌ ఎక్కువగా వినియోగిస్తున్న ఫాల్కన్‌-9 తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంది. వాస్తవానికి మూడు ఫాల్కన్‌-9 రాకెట్లను పక్కపక్కనే అమర్చడం ద్వారా దీన్ని రూపొందించారు. అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించడానికి ఉద్దేశించిన పునర్వినియోగ పరిజ్ఞానాన్ని దీనిలో ఉపయోగించారు. ఇందులోని మూడు ప్రధాన బూస్టర్లలో.. రెండు బూస్టర్లు ల్యాంచ్‌పాడ్ల మీద దిగాయి. మరో బూస్టర్‌.. సముద్రంలో భారీనౌకపై దిగాల్సి ఉండగా.. నియంత్రణ తప్పడంతో.. నీటిని ఢీ కొట్టుకుని పేలిపోయింది.

ఇక ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. అంతరిక్ష రంగంలో స్పేస్‌ ఎక్స్‌ కొత్త చరిత్ర సృష్టించింది. తాజా విజయంతో శాటర్న్‌-5 రాకెట్ల శకం తర్వాత.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వాహకనౌకగా ఫాల్కన్‌ హెవీ.. ఘనత సాధించింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న శక్తివంతమైన డెల్టా-4 రాకెట్‌ కన్నా ఇది రెట్టింపు బరువును మోసుకెళ్లగలదు. చౌకలో రోదసి ప్రయోగాలకు, చందమామ, అంగారకుడి మీదకు మానవులను తీసుకెళ్లడానికి.. ఈ రాకెట్‌ను ఉపయోగించాలని తయారీదారైన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ అధిపతి ఎలాన్‌ మస్క్‌ భావిస్తున్నారు. ఫాల్కన్‌ హెవీ ప్రయోగం విజయవంతమవడంతో.. రోదసి ప్రయోగ మార్కెట్‌లో స్పేస్‌ ఎక్స్‌కు పై చేయి లభిస్తుందని.. పరిశీలకులు చెబుతున్నారు. నాసా, ఉపగ్రహ కంపెనీలు, అమెరికా సైన్యం నుంచి భారీగా ప్రయోగ కాంట్రాక్టులను ఒడిసిపట్టడానికి వీలవుతుందని విశ్లేషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories