ఎన్నికల ఫీవర్ ఇలా సైలెంట్ చేసిందేమిటి?

Submitted by santosh on Fri, 11/16/2018 - 12:31
election fever in telangana

తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు సీట్ల సర్దుబాటులో తల మునకలవుతుంటే.. మరికొన్ని పార్టీలు మాత్రం అసలు ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేకుండా మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. అవే వైసీపీ, జనసేన, లోక్ సత్తా.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ మూడు పార్టీలదీ దాదాపు ఒకే ఐడియాలజీ.. అదే రాష్ట్రం సంఘటితంగా ఉండాలని..కానీ ఆ తర్వాత పరిస్థితులకనుగుణంగా వీరు కూడా ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ప్రకటించక తప్పలేదు.. మొదట్నుంచి సమైక్య వాదం వినిపించిన జగన్ రాష్ట్రం విడిపోడంతోనే తన ఏకాగ్రతను ఏపీ పైనే పెట్టారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తెలంగాణలోనూ పోటీ చేసినా.. అంతా నామమాత్రమే. ఈ ఎన్నికల్లో వైసీపీ రెండు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానాన్ని గెలుచుకుంది. ఏపీలో సీఎం కుర్చీ కోసం పోరాడుతున్న జగన్ తెలంగాణలో పోటీని లైట్ తీసుకున్నారు..దాంతో గెలిచిన నేతలు టీఆరెస్ లో చేరిపోయారు. కానీ నాలుగేళ్ల తర్వాత కూడా తెలంగాణపై జగన్ వైఖరి పెద్దగా మారలేదు.. ఏపీపై పెడుతున్న దృష్టి తెలంగాణలో పార్టీపై జగన్ పెట్టడం లేదు. ఏపీ ఎన్నికల కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నందున ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోమని 2024 ఎన్నికలలో పోటీకి సిద్ధపడతామని జగన్ స్పష్టం చేశారు. 

ఇక ప్రజారాజ్యంలో సామాజిక తెలంగాణ రాగం ఆలపించిన పవన్..జనసేన ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణపై తనకెంతో ప్రేమని చెబుతూ వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ ఉంటుందని, సచ్ఛీలురని రాజకీయాల్లోకి తెస్తామనీ, నీతిమంతమైన రాజకీయాలు చేస్తామనీ చెబుతూ వచ్చారు. కానీ తీరా ముందస్తు ఎన్నికలు వచ్చే సరికి పవన్ ఎందుకో కన్ఫ్యూజన్ లో పడిపోయారు.. ముందు అన్ని స్థానాలకూ పోటీ చేస్తామన్నారు.. ఆ తర్వాత సమయం తక్కువ ఉంది కాబట్టి 21 స్థానాలకు పోటీ  చేస్తామన్నారు.. తీరా ఎలక్షన్ డేట్ ప్రకటించే నాటికి  ఆ ఉత్సాహమూ చప్పబడిపోయింది. తెలంగాణ ఎన్నికలకు జనసేన దూరంగానే మిగిలిపోయింది. ఇక లోక్ సత్తా పరిస్థితీ అంతే.. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని  సీట్లకూ పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన లోక్ సత్తా ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు శాఖలుగా పార్టీని విడదీసింది. సామాజిక సమస్యలపై గట్టిగా పోరాడుతూ.. సమాజంలో మంచి మార్పును ఆశించే ఈ పార్టీ కూడా ఎందుకో తెలంగాణ ఎన్నికలకు దూరంగా నిలబడింది. 

గ్రేటర్ హైదరాబాద్ నగర సమస్యలపై పార్టీలన్నీ తమ మేనిఫెస్టోల్లో స్పష్టమైన హామీలిచ్చే దిశగా ఒత్తిడి పెంచడానికే ఈసారి లోక్ సత్తా పరిమితమవుతోంది. కీలకమైన ఈమూడు పార్టీలు నాలుగుకోట్ల మంది జనాభా ఉన్న ఒక రాష్ట్రానికి జరుగుతున్న ఎన్నికల్లో పాల్గొనరాదని నిర్ణయించడం విచిత్రమైన అంశమే.. ప్రధాన పార్టీలతో పోలిస్తే ఈ మూడు పార్టీలకు తెలంగాణలో ఆదరణ కొంత పరిమితంగానే ఉన్నందున.. అనవసరమైన సాహసాలకు పోయి.. ఆర్థిక ఇబ్బందులుకొని తెచ్చుకోడం ఎందుకనుకున్నాయో ఏమో ఈ సారి పోటీకి దూరంగా నిలబడిపోయాయి.. కానీ తెలంగాణలో ఈ మూడు పార్టీల వైఖరి ఏంటి? ఏ పార్టీకి ఓటు చేయమని ప్రజలకు సూచన చేస్తాయన్నది మాత్రం ఇంకా స్పష్టం కావడం లేదు. మరోవైపు జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. బిజేపీయేతర కూటమి ఏర్పాటుకు చంద్రబాబు సన్నాహాలు చేస్తుంటే, కాంగ్రెసేతర, బిజేపియేతర ఫ్రంట్ ఏర్పాటుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల నేతలు జాతీయ స్థాయిలో రాజకీయాలలో చక్రం తిప్పుతున్న నేపధ్యంలో ప్రతీ ప్రాంతీయ పార్టీ ఏదో ఓ ఫ్రంట్ తో జత కట్టాల్సిన తరుణంలో ఈ మూడు పార్టీల వైఖరి ఏంటన్నది మాత్రం ప్రశ్నగా మారింది.

English Title
election fever in telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES