టీఆర్ఎస్ కు ఎన్నికల కమిషన్ షాక్

Submitted by arun on Mon, 10/08/2018 - 10:14

కరీంనగర్ లో అధికార టీఆర్ఎస్ కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ తరపున ప్రచారం చేసిన సాంస్కృతిక శాఖకు చెందిన 8 మంది కళాకారులపై వేటు వేసింది. ఈ ఎనిమిది మంది కళాకారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సస్పెండ్ చేసింది. ఎన్నికల కమిషన్ దూకుడుతో పోలిటికల్ టచ్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు బెంబెలేత్తుతున్నారు. 

కరీంనగర్ లో తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత  గంగుల కమాలకర్ ఇటీవల సభ నిర్వహించారు. ఈ సభలో సాంస్కృతిక శాఖకు చెందిన శంకర్ అనే కళాకారుడి ఆధ్వర్యంలో ఏడుగురు కళాకారులు ప్రభుత్వం పథకాలపై ప్రచారం చేశారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ప్రభుత్వ సాంస్కృతిక శాఖకు చెందిన ఎనిమిది మంది కళాకారులు టీఆర్ఎస్ కు మద్దతుగా ప్రచారం చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 

గంగూల కమాలకర్ సభలో సాంస్కృతిక శాఖకు చెందిన 8 మంది కళాకారులు పాల్గొనడంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. 8 మంది కళాకారులకు జిల్లా పౌర సంబంధాల శాఖ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. ఎన్నికల కోడ్ గురించి తమకుతెలియదని, గంగుల కమలాకర్ కోరిన మేరకే సభలో పాల్గొన్నామని కళాకారులు వివరణ ఇచ్చారు. కళాకారుల వివరణపై జిల్లా పౌర సంబంధాల శాఖ సంతృప్తి చెందలేదు. 

ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సభలో పాల్గొన్న 8 మంది కళాకారులపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది.  టీఎస్ సీఎస్ రూల్ 1991, 1964 కింద సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మాద్  ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల హై కోర్టు సాంస్కృతిక శాఖలో కళాకారుల నియమాకాలు సరైన విధానంలో జరగలేదని అభిప్రాయపడింది. దీంతో కళాకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందునే సస్పెండ్ చేశారని బాధిత కళాకారులు వాదిస్తున్నారు. 

కొద్ది రోజుల క్రితం టీఆర్ ఎస్ హుజురాబాద్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా ప్రచారం చేసిన ప్రభుత్వ టీచర్ ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. తాజాగా 8 మంది కళాకారులపై వేటు పడింది.  ఎన్నికల కమిషన్ కఠిన వైఖరితో ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోతున్నారు. 

English Title
Election Commission Suspended Janapadam Artists

MORE FROM AUTHOR

RELATED ARTICLES