ఆసక్తి రేపుతున్న అభ్యర్థుల ఆస్తుల లెక్కలు

Submitted by santosh on Thu, 11/15/2018 - 10:41
election candidates nominations

తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఆస్తుల వివరాలు ఆసక్తిరేపుతున్నాయి. 2014లో ప్రకటించిన ఆస్తుల వివరాలకు 2018లో ప్రకటించిన ఆస్తుల వివరాలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌, బిజెపి పార్టీలకు చెందిన ప్రముఖుల ఆస్తులు ఎంత మేరకు పెరిగాయి ? వారి భార్యల పేరిట ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి ? అనే విషయాలు వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ద్వారా వెల్లడౌతున్నాయి.

మంత్రి హరీశ్‌రావు కోటీశ్వరుడని ఆయన ఎన్నికల నామినేషన్‌తోపాటు దాఖలు చేసిన అఫిడవిట్‌ స్పష్టం చేస్తోంది. ఆయన పేరిట  4.కోట్ల 46 లక్షల ఆస్తులున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువను 3కోట్ల 46లక్షలుగా పేర్కొన్నారు. హరీశ్‌ కంటే.. ఆయన భార్య శ్రీనితకు ఎక్కువ ఆస్తులున్నాయి. ఆమె ఆస్తి విలువ 6 కోట్ల 79లక్షలని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఏడాది కాలంలో హరీశ్‌ 16.03 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. వీటి విలువ 2 కోట్ల 73లక్షలుగా ఉంది. ఆయన భార్య 2015, 2017లో 2 కోట్ల 33లక్షల విలువచేసే 8.26 ఎకరాల భూమిని కొన్నారు. ఆమెకు కోటి 44లక్షల కోట్ల మేర అప్పులు కూడా ఉన్నాయి.

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబ ఆస్తుల విలువను 314 కోట్లుగా ప్రమాణ పత్రంలో చూపించారు. 2014లో భవనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేసినప్పుడు పేర్కొన్న ప్రమాణ పత్రంలో 68 కోట్లుగా ఉంది. తాజా ప్రమాణపత్రంలో  రాజగోపాల్ భార్య పేరిట చరాస్తులు 261 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాఖలైన నామినేషన్లలో అత్యధిక కుటుంబ ఆస్తుల విలువ కలిగిన అభ్యర్ధి రాజగోపాలే కావడం విశేషం.

మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి సనత్ నగర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. 2014లో చరాస్తులు 3.44 కోట్లు ఉండగా...2018లో 5.22 కోట్లకు పెరిగాయి. అదే విధంగా 2014లో స్థిరాస్తులు 12.1 కోట్లు కాగా...2018లో స్థిరాస్తులు 30.9 కోట్లకు చేరింది.  అదే విధంగా మరో మంత్రి జోగురామన్న ఆస్తుల వివరాలు కూడా ఆసక్తిని రేపుతున్నాయి. జోగురామన్న2014లో చూపిన చరాస్తులు 26.86 లక్షలు కాగా... 2018లో 1.38 కోట్లుకు పెరిగింది. అదే విధంగా స్థిరాస్థులు 62.99 లక్షల నుంచి 2.40 కోట్లుకు పెరిగాయి.

గోషామహల్‌ బీజేపీ అభ్యర్థి టి. రాజాసింగ్‌ తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. రాజాసింగ్‌ వద్ద రూ. 2 లక్షలు, తన భార్య వద్ద రూ. లక్ష నగదు ఉన్నట్లు, రాజాసింగ్‌ పేరిట ఆస్తులు రూ. 87,52,941, భార్య పేరిట రూ. 14,29,956 ఉన్నట్లు వివరించారు. రాజాసింగ్‌ పేరిట రెండు కోట్ల ఐదు లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఆయన భార్య పేరిట 24 లక్షల 35 వేల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. బ్యాంకు నుంచి రుణాలు కోటి 83 లక్షల 22 వేల 652 రూపాయలు  పొందినట్లు పేర్కొ న్నారు.

English Title
election candidates nominations

MORE FROM AUTHOR

RELATED ARTICLES