విశాఖలో విషాదఛాయలు...

Submitted by arun on Wed, 10/03/2018 - 11:11
MVVS Murthy

గీతం మూర్తి మరణవార్తతో విశాఖలో విషాదం నెలకొంది. లక్షలాది మందికి మార్గదర్శకంగా నిలిచిన మూర్తి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన మూర్తి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నతశి‌ఖరాలకు చేరుకున్నారు. విద్యా, వ్యాపార, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న మూర్తి మరణవార్తతో అభిమానులు, కుటుంబ సభ్యులు విషాదంలో కూరుకుపోయారు.

విద్యా ప్రదాత గీతం మూర్తి కన్నుమూశారు. అమెరికా పర్యటనకు వెళ్లిన మూర్తి వైల్డ్‌ లైఫ్‌ సఫారీని చూసేందుకు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో  ఐదుగురు ఉండగా నలుగురు అక్కడికక్కడే  మృతి చెందారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తానా సభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.  కాలిఫోర్నియాలో శనివారం  నిర్వహించే గీతం పూర్వ విద్యార్థి సమావేశంలో మూర్తి ముఖ్య అతిధిగా పాల్గొనాల్సి ఉంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం అందరిని కలచివేసింది. 

తెలుగు రాష్ట్రాల్లో గీతం మూర్తిగా సుపరిచితమైన ఈయన ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్‌ అందుకున్నారు. ఎంవీవీఎస్‌ మూర్తి పూర్తి పేరు మతుకుమిల్లి వీరవెంకట సత్యనారాయణమూర్తి.  తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం మూలపాలెం గ్రామంలో జన్మించిన మూర్తి ఉన్నతచదువులను కాకినాడలో పూర్తిచేశారు. 

80, 90 దశకంలో ఏపీలో పాపులర్ అయిన గోల్డ్‌స్పాట్ కూల్ డ్రింక్ ఉత్పత్తి సంస్థను ప్రారంభించింది ఈయనే. టీడీపీ వ్యవస్ధాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాలలో  అడుగుపెట్టి రెండు సార్లు విశాఖ పార్లమెంట్ నుంచి విజయం సాధించారు. గాంధేయవాదాన్ని అనుసరించే మూర్తి ఆయన స్పూర్తితోనే గీతం యూనివర్సిటీని స్ధాపించారు. దీని వల్ల లక్షలాది మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు.  మూర్తి  మృతిపై  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూర్తి అకస్మిక మరణవార్తతో గీతం పూర్వ విద్యార్ధులు విషాదంలో కూరుకున్నారు. విద్యా ప్రదాత తమకు దూరమయ్యాడంటూ ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నారు.  
 

English Title
DR MVVS Murthy History

MORE FROM AUTHOR

RELATED ARTICLES