మరింత విషమించిన కరుణానిధి ఆరోగ్యం...హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

మరింత విషమించిన కరుణానిధి ఆరోగ్యం...హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
x
Highlights

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమించింది. విషయం తెలుసుకున్న వెంటనే కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి, ఇతర నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున...

డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం విషమించింది. విషయం తెలుసుకున్న వెంటనే కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి, ఇతర నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కరుణానిధి నివాసానికి చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కరుణానిధి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా కావేరి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో కరుణానిధికి ఎనిమిది మంది వైద్యుల బృందం ప్రత్యేక చికిత్సనందించింది. అనంతరం హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు కరుణానిధి బీపీ లెవల్స్ తగ్గినట్టు తెలియజేశారు.

కావేరి ఆసుపత్రి దగ్గర పరిస్ధితిని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ సమీక్షించారు. వైద్యుల చికిత్స అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడుతున్నట్టు తెలియజేశారు. గొంతులో అమర్చిన ట్రాకియాస్టమీ ట్యూబ్‌ మార్పిడి కారణంగా కరుణకు స్వల్పంగా జ్వరం, ఇన్ఫెక్షన్‌ సోకిందన్నారు. కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ వైద్యుల బృందం 24 గంటల పాటు కరుణకు చికిత్స అందజేస్తోందని స్టాలిన్‌ తెలిపారు. కరుణానిధిని కావేరి ఆసుపత్రిలో చేర్చారన్న సమాచారం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, ఇతర మంత్రులు స్టాలిన్‌ను కలిశారు.

కరుణానిధి ఆరోగ్య పరిస్ధితిపై అటు కార్యకర్తలు ఇటు నేతలు తీవ్ర ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే పార్టీ అధ్యక్షుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన .. ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలను తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే అనవరమైన ప్రచారాలను నమ్మవద్దంటూ పార్టీ నేత రాజా విజ్ఞప్తి చేశారు. కరుణానిధి వైద్యానికి స్పందిస్తున్నారని ఎంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories