వెరైటీ దొంగ...డాన్య్ చేస్తూ...

Submitted by arun on Thu, 07/12/2018 - 16:58

ఒకప్పుడు దొంగతనం అంటే దొంగలకు అదో పెద్ద టాస్క్. ఏదైనా కొట్టేయాలంటే ప్లాన్ చేసి పని పూర్తి చేసే దాకా విపరీతమైన టెన్షన్. ఎక్కడ దొరికిపోతామేమోనని భయం. వెళ్లిన చోట ఏదైనా విలువైన వస్తువులు దొరికితే బావుండనే ఆశ. ఇలా చాలా  విషయాల్లో టెన్షన్ పడి అటెన్షన్ పాడవకుండా గుట్టు చప్పుడు లేకుండా పని పూర్తి చేసేవారు. ఇదంతా ఒక తరం దొంగల స్టైల్. ఇప్పుడు దొంగలు మారారు. దొంగతనం చేసే విధానం మారింది. 

పురుషులందూ పుణ్య పురుషులు వేరయా అన్నట్లు దొంగల్లో వెరైటీ దొంగలు వేరయా అన్నట్లు తయారైంది ఇప్పుడు పరిస్థితి. కొన్నాళ్ల ముందు వరకు దొంగల పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది. అప్పట్లో దొంగతనం చేయాలంటే ఎంతో భయపడేవారు. ఇప్పుడు ఆ భయమే లేకుండా పోయింది. దొంగతనం చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నారు దొంగలు. ఢిల్లీలో జరిగిన ఓ దొంగతనం చూస్తే.. మీకూ ఇదే అనిపిస్తుంది.

బేసిగ్గా దొంగతనానికి వచ్చిన వాళ్లు బెరుకు బెరుకుగా చూస్తూ చుట్టుపక్కల గమనించుకుంటూ ఎవరూ చూడకుండా పని కానిచ్చేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఢిల్లీలో ఈ దొంగ మాత్రం ఏ మాత్రం భయం లేకుండా అక్కడికేదో వాడి ఫ్రెండ్ పెళ్లి బరాత్‌కు వచ్చినట్లుగా రోడ్డుపై డ్యాన్స్‌ వేస్తూ కనిపించాడు. కొన్ని క్షణాల్లో దొంగతానికి పాల్పడనుండగా అతడు కొంచెం కూడా భయపడకుండా వీధిలో స్టెప్పులేశాడు. 

ఈ దొంగ వేషాలన్నీ ఆ వీధిలో ఉండే సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. తన తోటి దొంగ రాగానే వెంటనే హ్యాండ్ కర్చీఫ్ ముఖానికి కట్టుకొని దుకాణంలో దొంగతనం చేసేందుకు వెళ్లారు. ముగ్గురు వ్యక్తులు ఓ దుకాణం షట్టర్‌ తెరిచే ప్రయత్నం చేశారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఢిల్లీలోని ఓ గుర్తు తెలియని ప్రాంతంలో ఈ దొంగతనం జరిగింది. ఈ ఘటన జరిగిన రోజు రాత్రి దాదాపు ఐదుగురు దొంగలు 4 దుకాణాల్లో దొంగతనం చేసి లక్షల రూపాయలు, వస్తువులు కొట్టేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ దొంగతనంపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. 

English Title
Delhi Thief's Dance Caught On Camera Before Attempted Break-In

MORE FROM AUTHOR

RELATED ARTICLES