ఢిల్లీ వార్‌రూమ్‌ పాలిటిక్స్‌ ఏం చెబుతున్నాయి?

Submitted by santosh on Fri, 11/09/2018 - 13:22
delhi congress warroom

తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా సిద్ధమైన వేళ.. అసంతృప్తులను బుజ్జగించడం ఆ పార్టీకి సవాల్ గా మారింది. హస్తం పార్టీలోని ఆశావాహులు, అసంతృప్తి నేతలు తమ గళాన్ని పెంచారు. తెలంగాణలోని అసమ్మతి సెగలు ఢిల్లీని తాకాయి. ఇప్పటి వరకు గాంధీ భవన్‌కే పరిమితమైన అసంతృప్తి సెగలు.. డిల్లీని తాకాయి. తమకు న్యాయం చేయాలంటూ బీసీ నేతలు వార్ రూం ఎదుట ఆందోళనకు దిగారు. నాలుగు శాతం జనాభా ఉన్న వారికి 40 శాతం సీట్లు కేటాయించిన నేతలు.. తమకు మాత్రం అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్ని కేసులున్నా పట్టించుకోకుండా టికెట్లు ఇస్తున్న అధిష్టానం.. తమకు క్లీన్ ఇమేజ్ ఉన్నా ఎందుకు టికెట్లు కేటాయించడం లేదంటూ ప్రశ్నించారు. బీసీలకు న్యాయం చేయకపోతే, ఆత్మహత్యకు సైతం సిద్ధమని నేతలు హెచ్చరించారు. కాంగ్రెస్‌లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు, అసంతృప్తులు పెరగడంతో.. వారిని బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. అసంతృప్తులను వార్ రూం సమావేశానికి ఆహ్వానించిన స్క్రీనింగ్ కమిటీ సభ్యులు.. నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితి, సామాజిక సమీకరణాలను వివరిస్తూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో 2004 తరహా పరిస్ధితులు ఉన్నాయని.. నాటి తరహాలోనే ఇప్పుడు కూడా పొత్తులతో ఎన్నికలకు వెళుతున్నందున అంతా సహకరించాలంటూ కోరుతున్నారు. 

వార్ రూం సమావేశానికి పాల్వాయి స్రవంతి, ప్రేమ్ సాగర్ రావు, చంద్ర శేఖర్, బండ కార్తీకరెడ్డితో పాటు పలువురు ఆశావాహులు హాజరయ్యారు.  సీనియర్ నేతలు త్యాగాలకు సిద్దంగా ఉండాలన్నారు రేణుకాచౌదరి. కొత్తవారిని గెలిపించాల్సిన బాధ్యత సీనియర్లే తీసుకోవాలన్నారు.  సీట్లు దక్కని నేతలు, సీనియర్లు.. కూటమి అభ్యర్ధుల గెలుపు కోసం ప్రయత్నించాలని అధిష్టానం అంటోంది. అధికారంలోకి వస్తే, నామినేటెడ్ పదవులతో పాటు పార్టీలోనూ కీలక పదవులను ఇస్తామంటూ అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నారు.

English Title
delhi congress warroom

MORE FROM AUTHOR

RELATED ARTICLES