ఉమ్మెత్త ఊపిరి తీసేస్తుందా? బతకాలంటే ఇక బలుసాకే తినాలా?

Submitted by santosh on Thu, 06/07/2018 - 10:45
Datura metel very dangorous

బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చు అంటారు... ఈ మాట ఎంత వరకు నిజమో కాని.. ఓ కుటుంబం మాత్రం దీన్ని నమ్మి అడ్డంగా బుక్కయింది. ఓ టీవీ చానల్‌లో వచ్చిన ఆరోగ్య సూత్రాలను చూసి ఉమ్మోత్త చెట్టు ఆకులను తిని మరణం అంచుల వరకు వెళ్లింది. చివరకు ఆ కుటుంబ పెద్దను కోల్పోయింది. విశాఖపట్నంలోని మధురవాడ స్వతంత్రనగర్‌‌లోని వైకుంఠరావు కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. వైద్యుల సలహాలు, సూచనలు లేకుండా నాటు వైద్యాన్ని గుడ్డిగా నమ్మడమే వారు చేసిన పాపం. ఉమ్మెత్త ఆకుతో తయారు చేసుకున్న వంటకం తినడమే వారిని వెంటాడిన దురదృష్టం.

ఉమ్మెత్త ఆకు తినడం వల్ల నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. అందులో ఒకరు మృతి చెందారు. ఆయుర్వేద వైద్యం పట్ల మక్కువ ఉన్న స్వతంత్రనగర్‌కు చెందిన 54 ఏళ్ల వైకుంఠరావు కొన్నేళ్లుగా ఓ టీవీ ఛానల్‌లో వస్తున్న ఆయుర్వేద వైద్య సూచనలను డైరీలో రాసుకునేవారు. అనారోగ్య సమస్యలు వస్తే ఆ ఆయుర్వేద వైద్య చిట్కాలను ఆచరించేవారు. కిందటేడాది ఉబ్బసం ఎక్కువ కావడంతో ఈ చిట్కాలతో నయం చేసుకోవచ్చని ఆశ పడ్డాడు. అదే ప్రాణం తీసేసింది. మిగిలిన నలుగురిని అనారోగ్యం పాల్జేసింది.

అసలు ఉమ్మెత్త లక్షణమేంటి? ఉమ్మెత్త మొక్క.... పుట్టుకతోనే విషంతో పుడుతుంది. దాని జీవితకాలం విషం చిమ్ముతూనే ఉంటుంది. కాని అదే ఉమ్మెత్త చెట్టు ఎన్నో రకాల జబ్బులను నయం చేస్తుంది.  అలా నయం చేస్తుందని కదా అని వైద్యుల సలహా లేకుండా డైరెక్టుగా వాడితే.. ప్రాణాల మీదికే రావొచ్చు కూడా. నిజానికి ఈ మధ్యకాలంలో సొంత వైద్యాలు ఎక్కువైపోయాయి. పుస్తకంలో చదువడం లేదా ఎవరో చెబితే వినడంతో ఇంట్లోనే వైద్యం చేసుకుంటున్నాం. అలాంటి వైద్యమే ప్రాణాల మీదకు తెస్తోంది. వైజాగ్‌‌లో కూడా జరిగింది ఇదే.

ఆయుర్వేద వైద్యంలో ఉమ్మెత్త ఆకులను దత్తూరాగా పిలుస్తారు. ఉమ్మెత్త ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క మనిషిలో ఉన్న దీర్ఘకాలిక జబ్బులను తగ్గించేందుకు సంజీవనిలా పనిచేస్తుంది. అల్లోపతి వైద్యానికి తగ్గని ఏ జబ్బునైనా ఈ ఉమ్మెంత వల్ల తగ్గించవచ్చంటోంది ఆయుర్వేద వైద్య శాస్త్రం. మొకాళ్ల నొప్పులకు, కీళ్లనొప్పులు, ఒంటి నొప్పులు... ఇలా ఏ నొప్పులకైనా ఉమ్మెంత ఆకు రసాన్ని రాస్తే బ్రహ్మాడంగా పనిచేస్తుందట. ఉమ్మెత్త మొక్క పుట్టడమే విషంతో పుడుతుంది. గన్నేరుచెట్టు లాంటి భయంకరమైన కోవకి చెందినది ఈ మొక్క. చాలా రకాల మొండి జబ్బులను నయం చేసే ఈ మొక్క చాలా మొండి లక్షణాలు కలిగి ఉంటుంది. ఎక్కడో విన్నాం కదా అని డాక్టర్ల సలహా లేకుండా వాడితే ప్రాణాలకే ముప్పు వస్తుందంటారు డాక్టర్లు. 

మనం తినే బలుసాకైనా, ఉమ్మెంత ఆకైనా... ఇంకేదైనా డాక్టర్ల సలహా తీసుకోవడం మరిచిపోవద్దు. సొంత వైద్యం కొంత మానుకో.. డాక్టర్ల సలహా తీసుకో.. అన్న సంప్రదాయాన్ని పాటిస్తేనే బెటర్‌. ఏమంటారు?

English Title
Datura metel very dangorous

MORE FROM AUTHOR

RELATED ARTICLES