అభ్యర్థులకు వణుకుపుట్టిస్తున్న ఆ గ్రామ ప్రజల నిర్ణయం

Submitted by arun on Thu, 10/11/2018 - 11:28
vilages

ఆ గ్రామస్తులు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఏక కంఠంతో ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామప్రజలంతా కలసి మూకుమ్మడిగా ప్రమాణం చేశారు. ఇంతకీ ఆ గ్రామమేంటి? వారు తీసుకున్న నిర్ణయమేంటి? ఎన్నికలకు, దానికి లింకేంటి? 

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం దాసరిపల్లి గ్రామంలో రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు మూకుమ్మడిగా ప్రమాణం చేశారు. డెబ్పై ఏళ్ల నుంచి తమ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించనందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తామని సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. సుమారు 1250 మంది ఓటర్లున్న దాసరిపల్లికి ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన రోజుల్లో నాయకులు రారంటూ గ్రామ ప్రజలు భగ్గుమంటున్నారు. తమ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనివ్వమంటూ అధికారులను తమ గ్రామానికి పంపొద్దంటూ వేడుకుంటున్నారు.

తాగునీటి వసతి, రోడ్డు సౌకర్యం, సీసీ రోడ్లతో పాటు మరుగుదొడ్లు కూడా లేవని గ్రామస్తులు అంటున్నారు. ప్రాథమిక పాఠశాలలో కేవలం రెండు గదులు మాత్రమే ఉన్నాయి, అందులో ఒకటి ఆఫీస్ గది కాగా కేవలం ఒకే గదిలో 5 తరగతులు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేసినా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తాము రామంటూ అంబెలెన్స్‌ డ్రైవర్లు కరాఖండిగా చెబుతున్నారని వాపోతున్నారు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికలను మూకుమ్మడిగా బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయాన్ని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంకకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశామంటున్నారు. నాయకులు ఇప్పటికైనా స్పందించి మా గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి పనులు ప్రారంభిస్తే తప్ప ఎన్నికల్లో పాల్గొనమని గ్రామస్తులు ముక్తకంఠంతో చెబుతున్నారు.

English Title
dasarlapally village bycit elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES