తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరిగిన సైబర్ నేరాలు

తెలుగు రాష్ట్రాల్లో బాగా పెరిగిన సైబర్ నేరాలు
x
Highlights

మారుతున్న కాలంతోటే నేరాల తీరు మారుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలంటే హడలిపోయిన...

మారుతున్న కాలంతోటే నేరాల తీరు మారుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలంటే హడలిపోయిన ప్రజలు.. కానీ ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన సైబర్ నేరాలతో బెంబేలెత్తుతున్నారు. ఈ నేరాల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫీసర్లమంటూ అమాయకులను బురిడీ కొట్టించి వారి ఖాతాల్లోని సొమ్ము కాజేస్తున్నారు కేటుగాళ్ళు.

మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు చేస్తుంటాడనే మాట నిజం చేస్తున్నారు కేటుగాళ్ళు. ఇటీవల కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి. అమాయకులనే కాదు.. ఉన్నత విద్యావంతులు, పెద్దపెద్ద ఉదోగ్యులను సైతం ఈ సైబర్ కేటుగాళ్ళు బురిడీ కొట్టిస్తున్నారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం.. మీ డెబిట్ కార్డు గడువు ముగిసింది.. మీ కార్డు నెంబర్, పిన్ చెప్పండి అంటూ కొంత మంది ఆగంతకులు కాల్ చేసి ఆకౌంట్‌లో ఉన్న డబ్బు దోచేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రభుత్వోద్యోగికి ఫోన్ వచ్చింది. మీ ఖాతా ఉన్న బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం.. మీ కొత్త డెబిట్ కార్డ్ వచ్చింది.. మీ పాస్‌వర్డ్ చెప్పమన్నారు. నిజమేనని నమ్మి పాస్‌వర్డ్ చెప్పాడు. ఆ తరువాత అదే నెంబర్ నుంచి OTP చెప్పమని ఫోన్ చేశారు. నెంబర్ చెప్పగానే కాల్ కట్.. ఖాతాలోని 4 లక్షలు ఫట్. పదిరోజుల్లో కూతురు పెళ్లి కోసం డబ్బు తీయబోయిన ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. జరిగిన మోసాన్ని బ్యాంకు అధికారులకు, సైబర్ క్రైమ్‌ పోలీసులకు కన్నీటి పర్యంతమవుతూ వివరించాడు. నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు సైబర్ కేటుగాళ్ళలో ముగ్గురిని పట్టేశారు. ముఠాలో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. వీళ్లు ఇలా చాలా మందినే మోసం చేసినట్లు విచారణలో తేలింది.

విదేశాల్లో అడ్డా పెట్టిన కొందరు సైబర్ దొంగలు ఫోన్ కాల్స్‌తో ట్రాప్ చేస్తున్నారు. టెలి కాల‌ర్స్‌తో స్వీట్‌గా ఫోన్ చేయిస్తారు. మీరు లాట‌రీలో భారీ మొత్తంలో... మిలియన్ల కొద్దీ డాలర్లు గెలుచుకున్నారంటూ ట‌చ్‌లోకి వస్తారు. బ్యాంకు ఫార్మాలిటీస్‌ కోసం అంటూ మీ బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, పిన్, పాస్‌వర్డ్ వంటి వివరాలన్నీ కూపీ లాగి అకౌంట్‌ ఖాళీ చేస్తారు. రోజూ పదుల సంఖ్యలో ఇలాంటి మోసాలపై ఫిర్యాదులు వస్తుండటంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు లఘు చిత్రాలు రూపొందించారు. డెబిట్, క్రెడిట్ కార్డు సంబంధిత మోసాలు, ఓటీపీ నెంబర్ చెప్పకుండా ఎలా జాగ్రత్త పడాలనే అంశాలను వివరించారు. బ్యాంకు ఖాతాకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పమని ఏవైనా కాల్స్ వస్తే వెంటనే దగ్గరలోని పోలీస్‌స్టేషన్, సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేయాలని సూచిస్తూ నిర్మించిన షార్ట్ ఫిలింకి అర్జున్‌రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ, దర్శకుడు రాజమౌళి నటించి వాయిస్‌ ఓవర్ ఇచ్చారు. ఎవరైనా ఫోన్ కాల్‌ ద్వారా లేక ఈ మెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారం.. ముఖ్యంగా బ్యాంకు, ఇతర ఆర్థిక సంబంధమైన వివరాలు అడిగితే ఇవ్వకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసాల బారిన పడితే వెంటనే తమకి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories