ప్రణయ్ ఆత్మ ఏడుస్తోందా..?

Submitted by arun on Mon, 10/15/2018 - 14:06
Pranay Murder Case

ప్రణయ్‌ ఆత్మ తమతో మాట్లాడుతుందంటూ హైదరాబాద్‌కు చెందిన దంపతుల వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపాయి. పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్‌ మర్డర్‌ తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ప్రణయ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన భార్య అమృత గత కొంతకాలంగా పోరాడుతోంది. ఈ సమయంలో అనూహ్యంగా హైదరాబాద్‌ శివారు పటాన్‌ చెరుకు చెందిన సత్యప్రియ దంపతులు పరామర్శ పేరుతో మిర్యాలగూడలోని అమృత ఇంటికి చేరుకుంది. 

ప్రణయ్‌ ఆత్మ తమతో నిత్యం మాట్లాడుతుందని కావాలంటే ఆయన భార్య అమృతతో కూడా మాట్లాడిస్తామంటూ నాగారావు, సత్యప్రియ చెప్పారు. తొలుత ప్రణయ్‌ తల్లిదండ్రులతో ముచ్చటించిన ఈ దంపతులు ఆ తర్వాత అమృతతో కూడా మాట్లాడారు. ప్రణయ్‌ ఆత్మ ఇక్కడే ఉందని ఈ ఇంటి చుట్టే తిరుగుతుందని విగ్రహం ఏర్పాటు చేస్తే అది అందులోకి వెళ్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రణయ్‌ తమకు కలలో కూడా వస్తున్నాడని చెప్పిన సత్యప్రియ కపుల్స్‌ అమృత కోసం ఆత్మ పరితిపిస్తుందని వివరించారు. వచ్చే జన్మలో కూడా అమృతతోనే గడపాలని ప్రణయ్‌ కోరుకుంటున్నాడని తెలిపారు. గత జన్మలో మారుతిరావు, ప్రణయ్‌ బద్దశత్రువులని ఆ పగే ఈ జన్మలో తీరిందంటూ కబుర్లు చెప్పారు. ప్రణయ్‌ విగ్రహం ఎట్టిపరిస్తితుల్లో పెట్టొద్దని చెప్పిన హైదరాబాద్‌ కపుల్స్‌ విగ్రహం పెడితే అతడి ఆత్మ ఆ విగ్రహంలోనే ఉండిపోతుందని తెలిపారు. 

అయితే సత్యప్రియ దంపతుల మాటలపై అనుమానం కలిగిన అమృత డీఎస్పీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వన్‌టౌన్‌ సీఐ నాగరాజు ప్రణయ్‌ ఇంటివద్దకు చేరుకొని ఆ దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఐపీసీ సెక్షన్‌ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అసలు ఆ దంపతులు ఏ ఉద్దేశంతో ప్రణయ్‌ ఇంటికి వచ్చారు..? ఎవరైనా పంపితే వచ్చారా..? అనే కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు. 
 

English Title
couple talk pranay murdercase nalgonda

MORE FROM AUTHOR

RELATED ARTICLES