నరాలు తెగే ఉత్కంఠ.. కౌంటింగ్‌కు మొదలైన కౌంట్ డౌన్

నరాలు తెగే ఉత్కంఠ.. కౌంటింగ్‌కు మొదలైన కౌంట్ డౌన్
x
Highlights

ఓట్ల లెక్కింపు ఘట్టానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈనెల 11న 31 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం 44 కేంద్రాలను సిద్ధం చేశారు....

ఓట్ల లెక్కింపు ఘట్టానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈనెల 11న 31 జిల్లా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం 44 కేంద్రాలను సిద్ధం చేశారు. నియోజకవర్గాలవారీగా ఓట్లను మదింపు చేసేందుకు వీలుగా బెంచీలు, ఈవీఎంలను క్రమపద్ధతిలో అమర్చడం ఇప్పటికే పూర్తయింది. జిల్లాల వారీగా ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఎక్కడెక్కడున్నాయో ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన 44 లెక్కింపు కేంద్రాల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 13 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 2 కేంద్రాలు సిద్ధమయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఒక్కో కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌‌లోని ముషీరాబాద్‌, నాంపల్లి నియోజకవర్గాల ఓట్లను ఎల్బీ స్టేడియంలో, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల ఓట్లను యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మైదానంలో లెక్కిస్తారు. మిగిలిన 11 నియోజకవర్గాల ఓట్లను వేర్వేరు ప్రాంతాల్లో మదింపు చేయనున్నారు. పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను బట్టి ఒక నియోజకవర్గానికి 14+1 బెంచీలు ఏర్పాటు చేస్తారు. ఒక బెంచీపై ఆర్‌వో, పరిశీలకుడు ఉంటారు. వాళ్లు నిరంతరం లెక్కింపును పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఫలితాలను వెల్లడిస్తారు. మిగిలిన బెంచీల్లో ఒక్కోదానిపై కౌంటింగ్‌ ఏజెంట్‌, కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌, మైక్రో అబ్జర్వర్‌ కూర్చుని లెక్కింపులో నిమగ్నమవుతారు. పోలింగ్‌ కేంద్రాలు ఎక్కువగా ఉన్న మేడ్చల్‌లో 28+1 చొప్పున, తక్కువ కేంద్రాలున్న జనగామ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాల్లో 12+1 చొప్పున బెంచీలు ఏర్పాటు చేశారు. లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఆదివారం శిక్షణనివ్వనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ప్రతి నియోజకవర్గంలోనూ ఒక పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారు. ఆ పోలింగ్‌ కేంద్రాన్ని ర్యాండమైజేషన్‌ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియను పోటీ చేసిన అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో నిర్వహిస్తారు. వీవీప్యాట్‌ స్లిప్పుల సంఖ్యా, ఈవీఎంలో పోలైన ఓట్ల సంఖ్యా సరిపోలితే అక్కడ పోలింగ్‌ సక్రమంగా సాగినట్లు పరిగణిస్తారు. జిల్లా కేంద్రాల్లో జరిగే లెక్కింపు ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలూ, పోలీస్‌ కమిషనర్లూ సీసీటీవీల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు. లెక్కింపు కేంద్రాల్లోకి సిబ్బంది సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకూడదని ఆంక్షలు విధించారు. సిబ్బందికి మంచినీళ్లు, ప్రథమచికిత్స వంటి సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories