కన్నడ నావలో కాంగ్రెస్‌ మునిగిందా? తేలిందా?

Submitted by santosh on Wed, 05/16/2018 - 10:59
congress results in karantaka

అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీని కంగు తినిపించాయి. కాంగ్రెస్‌ అతి ఆత్మవిశ్వాసమే ఆ పార్టీ కొంప ముంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పట్టింపులకు పోయి కర్ణాటకలో ఎన్నికల పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ జేడీఎస్‌తో పొత్తు పెట్టుకొని ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని అంటున్నారు. 

కర్ణాటక ఎన్నికలను 2019లో జరిగే ఎన్నికలకు మినీ సంగ్రామంగా భావించారు. సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నా.. చివరకు బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోయింది. ఎన్నికలు జరిగిన 222 స్థానాలలో 50 సీట్లలో త్రిశంకు సమరం తప్పలేదు. దీంతో పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా బీజేపీ విపరీతంగా లాభపడింది. గత ఎన్నికల్లో 40 సీట్లకే పరిమితమైన కమల దళం ఈ సారి అదనంగా 64 స్థానాల్లో విజయం సాధించడమే దీనికి రుజువు. 

రోజురోజుకీ దేశవ్యాప్తంగా బలపడుతున్న బీజేపీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీలతో కలిసికట్టుగా ముందుకు సాగాలన్న కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ ఒంటెత్తు పోకడలకు పోయింది. రెండేళ్ల కింద‌ట‌జ‌రిగిన యూపీ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ ఇలాంటి పొర‌పాటే చేసింది. యూపీలో అధికార ఎస్పీతో పొత్తుకు సిద్ధ‌మై.. బీఎస్పీని వ‌దులుకుంది. దీంతో అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. బీహార్‌లో బీజేపీని మహాకూటమి అడ్డుకోవడాన్ని, ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలు కలిసి కమలం పార్టీని ఓడించడాన్ని మరిచిపోయింది. 

మొత్తానికి కన్నడ నాట కమల వికాసంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌లో అంతర్మథనం మొదలైనట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో ఓటమిని అధికార కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించింది. కాంగ్రెస్‌ ఘోరపరాభవానికి సిద్దరామయ్యే కారణమని జేడీఎస్‌ నిందిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఓటమికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌-జేడీఎస్‌ పొత్తు పెట్టుకొని ఉంటే.. ఫలితాలు చాలా భిన్నంగా ఉండేవని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

ప్రతిపక్ష పార్టీలు బీజేపీని ఎదుర్కోవాలంటే భేషజాలు విడనాడి ప్రాంతీయ పార్టీల బలాన్ని గుర్తించక తప్పదనే నిజాన్ని విస్మరించింది. అదే కాంగ్రెస్ చిన్న పార్టీలను కలుపుకు పోయుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English Title
congress results in karantaka

MORE FROM AUTHOR

RELATED ARTICLES