కాంగ్రెస్ లో రాహుల్ శకం మొదలైంది

కాంగ్రెస్ లో రాహుల్ శకం మొదలైంది
x
Highlights

కాంగ్రెస్‌లో రాహుల్ శకం మొదలైంది. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో.. యువరాజు పట్టాభిషేకం...

కాంగ్రెస్‌లో రాహుల్ శకం మొదలైంది. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో.. యువరాజు పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది. తొలి ప్రసంగంలోనే.. ప్రధాని మోడీపై రాహుల్ నిప్పులు చెరిగారు. బాధ్యతాయుతంగా మాట్లాడి.. ప్రతి ఒక్కరి అటెన్షన్‌ని తన వైపు తిప్పుకున్నారు.

19 ఏళ్ల పాటు ఏఐసీసీ అధినేత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సోనియాగాంధీ నుంచి.. కాంగ్రెస్ 49వ అధ్యక్షుడిగా రాహుల్‌ పార్టీ పగ్గాలు అందిపుచ్చుకున్నారు. నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టిన ఆరో వ్యక్తిగా రాహుల్‌ నిలిచారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్‌లో.. యువరాజు పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది.

అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. రాహుల్ తన స్పీచ్‌లో ప్రధాని మోడీకే బాణం గురిపెట్టారు. దేశ రాజకీయాల్లో జాతీయవాదం లోపించిందన్న ఏఐసీసీ అధినేత.. ప్రజలను ఉద్దరించాల్సింది పోయి.. వారిని మరింత అణగదొక్కేందుకు రాజకీయాలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 21వ శతాబ్దానికి నడిపిస్తే... ప్రధాని మోడీ మాత్రం వెనక్కి తీసుకెళ్తున్నారని రాహుల్ మండిపడ్డారు.

ఇక సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో కొత్త జవసత్వాలు నింపుతామన్నారు రాహుల్. పాత, కొత్త తరాలను కలుపుకుని ముందుకెళ్తామన్న ఆయన.. రానున్న రోజుల్లో దేశం నలుమూలలా కాంగ్రెస్ గళం మార్మోగాలని ఆకాంక్షించారు. ఒంటరిగా పోరాడలేని వారికి నూతన బలాన్ని అందించి.. కలిసికట్టుగా పోరాడతామని చెప్పారు. బీజేపీని నిలువరించేంది ఒక్క కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలేనని రాహుల్ గట్టి పంచ్ పేల్చారు.

బీజేపీ కాంగ్రెస్‌ను తుడిచిపెట్టాలనుకుంటున్నా.. తాము మాత్రం కాషాయ నేతలను కలుపుకొని పోవాలనుకుంటున్నట్లు తెలిపారు. 13 ఏళ్లుగా సోనియా, మన్మోహన్ సహా పార్టీ పెద్దల నుంచి అనేక విషయాలు నేర్చుకున్నానన్నా రాహుల్... పెద్దలు చూపిన బాటలోనే పనిచేస్తానని తెలిపారు. రాహుల్ పట్టాభిషేకం సందర్భంగా ఏఐసీసీ కార్యాలయంలో.. కార్యకర్తల ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ఆ ప్రాంగణమంతా రాహుల్‌.. నినాదాలతో హోరెత్తిపోయింది. టపాసులు కాలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కార్యాలయం బయట భారీ ఎత్తున బాణాసంచా పేల్చారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో రాహుల్ పట్టాభిషేకం సందర్భంగా కార్యకర్తలు ర్యాలీలు తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories