పాలమూరు సెంటిమెంట్‌ కాంగ్రెస్‌కు కలిసొస్తుందా?

పాలమూరు సెంటిమెంట్‌ కాంగ్రెస్‌కు కలిసొస్తుందా?
x
Highlights

బీజేపీ ఎన్నికల శంఖారావం అక్కడి నుంచి ప్రారంభించింది. కొబ్బరికాయ కొట్టి, కాంగ్రెస్‌ తమ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు మలివిడత...


బీజేపీ ఎన్నికల శంఖారావం అక్కడి నుంచి ప్రారంభించింది. కొబ్బరికాయ కొట్టి, కాంగ్రెస్‌ తమ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు మలివిడత ప్రచారానికీ, అక్కడి నుంచి మొదలెట్టేందుకు ఖద్దరు పార్టీ ప్లాన్‌ చేస్తోంది. కాంగ్రెస్‌కు ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చొచ్చినట్టుగా కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికల మొదటి విడత ఎన్నికల ప్రచారం జోగులమ్మ అమ్మవారి సాక్షిగా ఈ జిల్లా నుంచే ప్రారంభించి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. పాలమూరు గడ్డ నుంచే టీఆర్‌ఎస్‌పై ఎన్నికల యుద్దం ప్రకటించింది. మలివిడత ప్రచారానికి కూడా ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లానే ఎంచుకుంది. ఈనెల 4 న గద్వాల, అలంపూర్‍ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేయగా, ఈ నెల 10,11వ తేదీల్లో కూడా ఏకంగా తొమ్మిది నియోజకవర్గాల్లో మూడు రొజుల పాటు విస్త్రుత ప్రచారానికి పాలమూరే వేదిక.

ఈ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాపై భారీ ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్‌. రాష్ట్రంలో ఎక్కడా లేనంత బలంగా, జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉందని భావిస్తున్న కాంగ్రెస్, అధిక సీట్లు సాధించేందుకు ఇక్కడే గట్టి ఫోకస్‌ పెట్టామంటోంది. అందులోనూ మాజీ మంత్రులు డీకే అరుణ, చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డితో పాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, సీనియర్ నేత జైపాల్‌ రెడ్డి కూడా ఇక్కడి వారే కావడం కూడా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. గత ఎన్నికల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ హవా వీచినా...పాలమూరులో మాత్రం కాంగ్రెస్‌ ఎదురొడ్డి నిలిచింది. గత ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలుపొందగా, ఈసారి ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా, పావులు కదుపుతోంది. అదే లక్ష్యంతో రాష్ట్రంలోనే మొట్ట మొదటగా ప్రచారాన్ని ఉమ్మడి మహబూబ్‍ నగర్‌ జిల్లాలోని అలంపూర్‌ నుంచే శ్రీకారం చుట్టారు. ఇక రెండో దశలో భాగంగా మూడు రోజుల ప్రచారం కూడా ఇక్కడి నుంచే రూపొందించారు.

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ చేపట్టిన ఎన్నికల ప్రచారం ఉమ్మడి జిల్లాలో, వనపర్తి మినహా అన్ని నియోజకవర్గాల్లో పూర్తి కానుంది. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను రెండు నియోజకవర్గ కేంద్రాలు జిల్లాల పునర్విభజనలో భాగంగా పక్క జిల్లాలో కలిశాయి. షాద్‌నగర్‌ నియోజకవర్గం పూర్తిగా రంగారెడ్డి జిల్లాలో, కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రంతో పాటు రెండు మండలాలు వికారాబాద్‌ జిల్లాలో కలిశాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ పాలమూరుకు సంబంధించి 12 నియోజకవర్గాలలో ప్రచార షెడ్యూల్‌ను రూపొందించింది.ఒక్క వనపర్తి నియోజకవర్గం మినహా, మిగతా నియోజకవర్గాలన్నింటికీ ప్రచార వ్యూహాన్ని సిద్దం చేసింది కాంగ్రెస్. మహాకూటమిలో భాగంగా వనపర్తి సీటు ఎవరికి కేటాయించాలో తేలక, పైగా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాగా, టీడిపి నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో అంతా క్లారిటీ వచ్చిన తర్వాత మరోమారు వనపర్తిలో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories