తెలంగాణ కాంగ్రెస్‌లో భగ్గుమన్న అసంతృప్తులు

Submitted by arun on Fri, 11/09/2018 - 17:34
Congress Leaders

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తులు భగ్గుమన్నాయి. అభ్యర్థులను ప్రకటించక ముందే ఆశావహులు రోడ్డెక్కారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్‌లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో మకాం వేసిన ఆశావహులు ఓ వైపు ప్రయత్నాలు చేస్తుండగానే  రాష్ట్రంలో పలు చోట్ల కార్యకర్తలు నిరనసలకు దిగారు. నకిరేకల్‌ టికెట్‌పై కోమటిరెడ్డి బ్రదర్స్‌ భగ్గుమంటున్నారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే తాను కూడా నల్గొండ నుంచి పోటీ చేయనని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు. కార్తకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా పార్టీ నడుచుకుంటే ఎంతటి వారినైనా ఓడిస్తారని హెచ్చరించారు.   

నార్కట్ పల్లి వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల ఆందోళనపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నకిరేకల్  టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకుంటే నల్గొండలో తాను పోటీ చేయనని తేల్చి చెప్పారు. పొత్తుల పేరుతో నకిరేకల్‌ను వేరొకరికి ఇస్తే చూస్తూ ఉరుకోబోమన్నారు. జరగబోయే పరిణామాలకు ఉత్తమ్ , జానారెడ్డి బాధ్యత వహించాలని కోమటిరెడ్డి హెచ్చరించారు. నకిరేకల్ టికెట్ తనకే ఇవ్వాలని కాంగ్రెస్ నేత చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. తనకు సీటు రాలేదని జరుగుతున్న ప్రచారంతో కార్యకర్తలు ఆవేదనకు గురయ్యారని చిరుమర్తి లింగయ్య చెప్పారు. ఇంటి పార్టీకి నకిరేకల్ టిక్కెట్ ఇస్తే కాంగ్రెస్ కు తీవ్ర నష్టమని లింగయ్య అన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేసిన జనగామ టికెట్ ను తెలంగాణ జన సమితికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కేటాయించినట్లు వస్తున్న వార్తలపై సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ప్రచారం పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ హైకమాండ్ టీజేఎస్‌కు జనగామ టికెట్‌ను కేటాయించలేదని స్పష్టం చేశారు. ఒకవేళ టీజేఎస్‌కు తన నియోజకవర్గాన్ని అప్పగిస్తే అధికార టీఆర్ఎస్‌కు లాభం చేకూరుతుందని పొన్నాల హెచ్చరించారు.  ఒకవేళ జనగామ అసెంబ్లీ నియోజకవర్గాన్ని త్యాగం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరితే తాను హైకమాండ్‌తో మాట్లాడుకుంటానని స్పష్టం చేశారు. తనలాంటి బీసీ నేతలకు అన్యాయం చేయడం సరికాదని పొన్నాల అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కుటమి ఒప్పందంలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గం టికెట్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ జనసమితికి కేటాయించడంతో .. నందికంటి శ్రీధర్‌ను కాదని బయటి పార్టీకి ఇవ్వడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌‌ను ముట్టడించిన కార్యకర్తలు అధిష్ఠానం తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. కోదండరాం డౌన్ డౌన్, టీజేఎస్ నశించాలి, మల్కాజిగిరి సీటును శ్రీధరన్నకే కేటాయించాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉందని.. ఎన్నికల సమయంలో మరో కొత్త పార్టీకి నియోజకవర్గాన్ని అప్పగించడం టీఆర్ఎస్‌కు మేలు చేస్తుందని నందికంటి శ్రీధర్‌ వర్గీయులు వాదిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

మల్కాజ్ గిరి టికెట్ టీజేఎస్ కేటాయించారంటూ ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తల్ని వి. హనుమంతరావు సముదాయించారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న వారితో వీహెచ్ మాట్లాడారు. మల్కాజ్ గిరి కార్యకర్తల డిమాండ్ ను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గాంధీ భవన్ ఎదుట ఖానాపూర్  కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన దిగారు. పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్న  తమ  నేత అజ్మీరా హరి నాయక్ కు టికెట్ ఎందుకు కేటాయించలేదంటూ ... కార్యకర్తలు నిరసనకు దిగారు. రమేష్ రాథోడ్ కు టికెట్ కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. 

English Title
Congress Leaders and Cadre Protest at Gandhi Bhavan

MORE FROM AUTHOR

RELATED ARTICLES