కాంగ్రెస్‌ కేసులే.. కారు పార్టీ ప్రచారాస్త్రాలు

x
Highlights

నాలుగున్నరేళ్ల పాలన కన్నా వరుసగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కన్నా విజయమే తప్ప ఓటమెరుగని నాయకులున్నా అధికార టీఆర్ఎస్‌ పార్టీ వాటినేమాత్రం...

నాలుగున్నరేళ్ల పాలన కన్నా వరుసగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కన్నా విజయమే తప్ప ఓటమెరుగని నాయకులున్నా అధికార టీఆర్ఎస్‌ పార్టీ వాటినేమాత్రం ప్రచారాస్త్రాలుగా భావించడం లేదు. కేసీఆర్‌ సర్కారును ఇరుకున పెట్టాలని విశ్వప్రయత్నాలు చేసిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ను వారు తీసిన గోతిలోనే పడుకోబెట్టాలని అధికార పార్టీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది.

ప్రత్యేక తెలంగాణలో తొలి ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంలోనే ప్రజాతీర్పు కోసం సిద్ధమైంది. ముందస్తు ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేస్తున్న ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అయితే ఈ నాలుగున్నరేళ్ల కాలంలో గతంలో ఏ ప్రభుత్వం ఎదుర్కోనన్ని కేసులు కేసీఆర్‌ సర్కారు ఎదుర్కొంది. ఒకటి కాదు.. రెండు కాదు.. సర్కారు తీసుకున్న ప్రతీ నిర్ణయంపైనా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఏకంగా 189 కేసులు నమోదయ్యాయి.

ముఖ్యంగా కాంగ్రెస్‌, దానికి మద్దతిచ్చే వారే కేసులు వేస్తున్నారని రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ కేసీఆర్ చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లూ ఆరోపణలతోనే సరిపెట్టిన కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో ఈ కేసులనే ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రాజెక్టులు, పథకాలపైన వేసిన కేసుల చిట్టాను ప్రజల ముందు ఉంచేందుకు నిర్ణయించారు.

ఇప్పుడిప్పుడే ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ వేసిన కేసులను ప్రజల ముందుంచి మైలేజ్ పొందాలని అధికార పార్టీ భావిస్తుంది. అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎవరెవరితో కేసులు పెట్టించారనే విషయాలతో పాటు వాటికి కాంగ్రెస్ పార్టీ ఎలా సపోర్ట్ చేసిందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. ముఖ్యంగా వివిధ నోటిఫికేషన్‌లపై వేసిన కేసులు సింగరేణి బొగ్గుగని కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను కేసుల ద్వారా అడ్డుకున్నారనే ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఇక తెలంగాణ అడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కూడా నిలిచిపోవడానికి కాంగ్రెస్సే నాయకులు చేసిన ఫిర్యాదులే కారణమనే విషయాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. రైతుబంధుపై కూడా ఈసీకి ఫర్యాదు చేశారని ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

ఇటు జాగృతి ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలను కూడా ఈ సారి నిలిపేశారు. రాజకీయాలు చేయదల్చుకోలేదని ఈ సారి నిర్వహించేది లేదని ఎంపీ కవిత స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ను మరింత ఇబ్బంది పెట్టాలని గులాబీదళం భావిస్తోంది. కాంగ్రెస్ అభివృద్ధికి ఆటంకంగా తయారు అయ్యిందని ఇప్పటికే చాలాసార్లు ఆరోపించిన కేసీఆర్‌ ఇకపై ప్రజా ఆశీర్వాద సభల్లో వీటిపై సాక్ష్యాలతో సహా ప్రజల ముందుంచనున్నారు. కేసుల వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories