రైతు చుట్టూ పార్టీలు

x
Highlights

పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలలే ఉండడంతో వ్యూహ ప్రతివ్యూహాలకు పార్టీలు పదునుపెడుతున్నాయి. రైతులు, పేదల సమస్యల గురించి రాహుల్ గాంధీ...

పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలలే ఉండడంతో వ్యూహ ప్రతివ్యూహాలకు పార్టీలు పదునుపెడుతున్నాయి. రైతులు, పేదల సమస్యల గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి ఓటుబ్యాంకుగా ఉన్న వ్యాపార వర్గాలను, మధ్యతరగతి ప్రజలను మళ్లీ ప్రసన్నం చేసుకోవడానికే ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నారు. అవినీతిపై పోరు, ధరల తగ్గింపుపై దృష్టిసారించారు. ఫెడరల్ ఫ్రంట్ జపం చేస్తున్నతెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ అధినేత దేశవ్యాప్తంగా రైతు బంధు పథకం అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జీఎస్టీ, నోట్లరద్దులను తమ ప్రధాన ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో గెలిచి కొలువు తీరిన రెండు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ ప్రకటించాయి. ఇక రాజస్థాన్‌ కూడా నేడోరేపో రుణమాఫీ నిర్ణయం తీసుకోబోతోందని రాహుల్‌గాంధీ స్వయంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రకటించకపోతే ప్రధాని మోదీని నిద్రపోనివ్వబోమని హెచ్చరించారు. మోదీ చేయకపోతే తామ అధికారంలోకి వచ్చాక చేస్తామని సంకేతాలిచ్చారు. నోట్ల రద్దుతో సామాన్యుల పడుతున్న కష్టాలను రాహుల్ గాంధీ ఏకరువు పెడుతున్నారు.

రైతు సమస్యల్ని కాంగ్రెస్‌ ఎజెండాగా ఎంచుకోవడంతో బీజేపీ అప్రమత్తమైంది. దేశవ్యాప్త రుణమాఫీపై ఇంకా తేలనప్పటికీ, రాష్ట్రాల వారీగా ఎక్కడికక్కడ రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటోంది. గ్రామీణ రైతుల 650 కోట్ల కరెంటు బిల్లులను మాఫీ చేస్తున్నట్లు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల 6 లక్షల 22 వేల గ్రామీణ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అసోంలోని బీజేపీ సర్కారు కూడా రైతు రుణాలను పాక్షికంగా మాఫీ చేస్తున్నట్టు వెల్లడించింది. 25 వేల దాకా ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు 99 శాతం ఉత్పత్తులు, సేవల్ని త్వరలో 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లోకి తేనున్నట్టు మోడీ ప్రకటించారు. దీంతో ధరలు తగ్గనున్నాయి.

దేశవ్యాప్తంగా రుణమాఫీకి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా, రాష్ట్రాల వారీగా ఎక్కడికక్కడ రైతులకు మేలు చేసే నిర్ణయాలు బీజేపీ తీసుకుంటోంది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ‌్రంట్ పని చేస్తుందని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్నారు. దేశంలోని రైతులు సమస్యలకు ఈ రెండు పార్టీల విధానాలే కారణమని ఆరోపిస్తున్నారు. రుణమాఫీతో పాటు తెలంగాణలో విజయవంతంగా నడుస్తున్న రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు బంధు పంటకు పెట్టుబడిగా పని చేస్తుందని ఆయన చెబుతున్నారు. రైతు బంధు పథకంతో దేశంలో వ్యసాయం రూపురేఖలు మారిపోతాయని, రైతుల బతుకులు బాగుపడతాయని కేసీఆర్ భరోసా ఇస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories