కాంగ్రెస్‌ పార్టీలో కుర్చీల కుమ్ములాట...సీఎం పదవిపైనే ముగ్గురు నేతల కన్ను

కాంగ్రెస్‌ పార్టీలో కుర్చీల కుమ్ములాట...సీఎం పదవిపైనే ముగ్గురు నేతల కన్ను
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో కుర్చీల కుమ్ములాట మొదలయింది. సీఎం పదవిపై ఎవరికి వారు...ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. నేతల వ్యాఖ్యలతో కాంగ్రెస్‌...

తెలంగాణ కాంగ్రెస్‌లో కుర్చీల కుమ్ములాట మొదలయింది. సీఎం పదవిపై ఎవరికి వారు...ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. నేతల వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరు మొదలయింది. ఎన్నికలు జరగకముందే నేతలు పదవి కోసం పొట్లాడుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేయకుండా సీనియర్లు సీఎం సీటు కోసం పోటీపడటంపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఒకరు కాంగ్రెస్‌‌లో సీనియర్ నేత మరొకరు పార్టీలో పదవిలో ఉన్న అగ్రనేత ఇంకొకరు కాంగ్రెస్‌లోకి కొత్తగా చేరిన లీడర్‌. కాంగ్రెస్‌ పార్టీలో ముగ్గురు నేతలు హాట్‌ టాపిక్‌గా మారారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ముఖ్యమంత్రి పదవిపై ఎవరికి వారుగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న లక్ష్యం కంటే పదవుల కోసం పాకులాడటమే నేతల్లో ఎక్కువగా ఉంది. ముగ్గురు నేతల వ్యవహారశైలిని కింది స్థాయి నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. సర్కార్ అవినీతి, అక్రమాలను ఎత్తి చూపి విశ్వాసం పెంచాల్సిన నేతలు ఇలా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టి ముందుండి నడిపించాల్సిన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ పదవిని కాపాడుకోవడానికే సమయం కేటాయిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎంనంటూ అనుచరులతో ప్రచారం చేయించుకోవడం విమర్శలకు దారి తీసింది. నాయకుడే పార్టీలో గ్రూపులను ప్రొత్సహిస్తే ఎలా అంటూ క్యాడర్ ప్రశ్నిస్తోంది. పార్టీని నడిపించడంలో ఉత్తమ్‌ విఫలమయ్యారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే విమర్శించారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాదని విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించే అవకాశం ఉన్నా సీఎల్పీ నేత జానారెడ్డి నాలుగేళ్లుగా ఏనాడు పెదవి విప్పలేదు. అసెంబ్లీ లోపల, బయట సర్కార్‌ను విమర్శించిన దాఖలాలు లేనే లేవు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానంటూ భీష్మించుకూర్చున్నారు తప్పా ప్రభుత్వాన్ని ఒక్కసారి కూడా ఇరుకున పెట్టిన సందర్భాలు లేవు. సీఎం పదవికి తనను మించిన అర్హత ఎవరికి లేదంటూ కొత్త చర్చకు తెరలేపారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి పార్టీలో చేరే ముందు కొన్ని హామీలు ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు. నామమాత్రమైన పదవి ఇస్తే సైలెంట్‌గా ఉండిపోనని హైకమాండ్‌కు లేఖ రాస్తానంటూ రేవంత్‌రెడ్డి ప్రకంపనలు రేపారు.

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలకు ఓపిక లేకపోతే ఎలా విమర్శలకు దిగుతున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి...కాంగ్రెస్‌కు నష్టం జరిగేలా వ్యవహరించడం సరికాదని పొంగులేటి సుధాకర్‌ రెడ్డి బహిరంగంగానే హెచ్చరించారు. సీఎం పదవిపై రాహుల్ దూతలు హామీ ఇస్తే వాళ్లనే అడగాలని ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవాల్సిన నేతలు ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు. అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలిగిస్తుండటంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories