అమావాస్య చంద్రుడు.. పౌర్ణమి చంద్రుడు

అమావాస్య చంద్రుడు.. పౌర్ణమి చంద్రుడు
x
Highlights

చంద్రుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మారుతుంటాడు. పౌర్ణమి తర్వాత నుంచి క్రమంగా క్షీణిస్తూ చివరకు అమావాస్య నాటికి పూర్తిగా కనిపించకుండాపోతే.. అమావాస్య...

చంద్రుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మారుతుంటాడు. పౌర్ణమి తర్వాత నుంచి క్రమంగా క్షీణిస్తూ చివరకు అమావాస్య నాటికి పూర్తిగా కనిపించకుండాపోతే.. అమావాస్య తర్వాత మాత్రం దినదినాభివృద్ధి చెందుతూ మరిన్ని వెలుగులు పంచుతూ మెరిసిపోతాడు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చంద్రులే. ఒకరు చంద్రశేఖర్ రావు కాగా, మరొకరు చంద్రబాబు నాయుడు. ఇద్దరి పరిపాలన ఒకేసారి మొదలైంది. వీళ్లలో చంద్రబాబుకు సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉంది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి గాను, మరో పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగాను పనిచేశారు. మరోవైపు చంద్రశేఖర్ రావు మాత్రం ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా గానీ, ప్రతిపక్ష నాయకుడిగా గానీ ఏమాత్రం అనుభవం లేదు. మంత్రిగా మాత్రమే పనిచేశారు. కానీ... సుదీర్ఘ కాలం ప్రజల్లో ఉన్నారు. వాళ్ల అవసరాలేంటో తెలుసుకున్నారు. ఏం చేయాలో అర్థం చేసుకున్నారు. అక్కడి నుంచి ఇక పాలనలో దూసుకెళ్లిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వరుసగా చేపడుతున్న చర్యలు చూస్తుంటే.. ప్రతిపక్షాలు కూడా ముక్కున వేలేసుకుంటున్నాయి. ఎప్పుడూ ప్రత్యక్షంగా అధికారాన్ని పంచుకోకపోయినా, అధికార పార్టీలతో చాలావరకు సత్సంబంధాలు కొనసాగిస్తూనే, బహిరంగ వేదికల మీద, అసెంబ్లీలోను నిశితంగా విమర్శిస్తుండే మజ్లిస్ పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటోంది. ముందుగా ప్రజల సంస్కృతీ సంప్రదాయా లను తెలుసుకుని, వాటికి విలువనివ్వడం, వాటిని మొత్తం పాలనలో మమేకం అయ్యేలా చూడటం, ఏ వర్గం వాళ్ల అవసరాలు ఏవేంటో తెలుసుకోవడం, వాటిని తీర్చడానికి ప్రయత్నాలు మొదలుపెట్టడం, పాలన మొత్తాన్ని గాడిలో పెట్టడం, ప్రజల దగ్గరకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లడం లాంటి విప్లవాత్మక చర్యలన్నిం టికీ కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ముందుగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించడానికి బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, దానికి అత్యధి క ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాతి నుంచి వరుసపెట్టి ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగు లు తీయిస్తూ, మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇబ్బడి ముబ్బడిగా మొదలుపెడుతూ, మంత్రుల మీద కూడా గట్టి పట్టు సాధించి ఒక పది గుర్రాల రథాన్ని అధిరోహించి నట్లుగా అన్ని రంగాలనూ తన అదుపులో పెట్టుకున్నారు.

వర్గాల వారీగా ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలగాలని తలపెట్టిన కేసీఆర్.. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం పూర్తిగా స్వయం సమృద్ధంగా ఉండాలని ఆశించారు. ఇక్కడి అవసరా లకు కావల్సిన వాటిని ఇతర ప్రాంతాల నుం చి దిగుమతి చేసుకోవడం ఎందుకని, మనకు మనమే సిద్ధం చేసుకోవాలని అన్నారు. అందుకోసం ముందుగా చేపలు, మాంసంపై దృష్టి పెట్టారు. చేపలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచే హైదరాబాద్ నగరానికి ఎక్కువగా వస్తాయి. అక్కడి తీరప్రాంతాలలో విస్తారం గా చేపల పెంపకం, రొయ్యల పెంపకం చేపడతారు. అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అందుకే అక్కడే మత్స్యకారులు ఎక్కువగా కనిపిస్తారు. అయితే, చేపల కోసం పూర్తిగా ఆ రాష్ట్రంపై ఆధారపడటం ఎందుకని భావించిన కేసీఆర్.. ఇక్కడి చెరువుల్లో చేపల పెంపకం ప్రారంభించాలని ఆదేశించారు. దానికి అనుగుణంగా చేప పిల్లలను సేకరించి చెరువు ల్లో వదిలించడం మొదలుపెట్టారు. ముదిరాజ్‌లు, ఇతర వర్గాల వారికి వాటిని కేటాయించి, తెలంగాణ రాష్ట్రానికి కావల్సిన చేపలన్నింటినీ ఇక్కడే పెంచేలా చూశారు. ఇక అక్కడి నుంచి మాంసం, పాలు, కూరగా యలు, ఇతర అవసరాలు కూడా ఇక్కడివాటికి ఇక్కడే ఆధారపడాలని చెప్పారు. అందుకు అనుగుణం గానే ముందుగా గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారు. ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున కేటాయించి మాంసం ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టేలా చూశారు. ఆ తర్వాత తాజాగా పాల ఉత్పాదన గురించి దృష్టి కేంద్రీక రించారు. రాష్ట్రంలో పాల అవసరం లక్ష కోట్ల లీటర్లుం టే పాల సమాఖ్యలన్నీ కలిపి కూడా కేవలం 7 లక్షల లీటర్లు మాత్రమే ఇస్తున్నాయని, మిగిలినదంతా ఇతర రాష్ట్రాల నుంచి డెయిరీలు సరఫరా చేస్తున్నాయని ఆయన చెప్పారు. క్షీర విప్లవం రావాలని చెప్పిన ఆయన.. అందుకోసం పాల సొసైటీలలో సభ్యులు ఏ కులం వారైనా సరే.. వాళ్లకు 50 శాతం సబ్సిడీ మీద బర్రెలు ఇప్పిస్తున్నారు. అదే ఎస్సీ ఎస్టీలైతే అది కూడా భరించలేరు కాబట్టి వారికి 75 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు.

పాలనలో సైతం కేసీఆర్ తనదైన మార్కు చూపిస్తున్నారు. జిల్లాల సంఖ్యను 10 నుంచి 31కి పెంచినపుడు చాలామంది ఆ నిర్ణయాన్ని ఎద్దేవా చేశారు. కేసీఆర్ జిల్లాలంటూ ఉద్యోగులలో కూడా కొంతమంది దీన్ని అవహేళన చేశారు. కానీ ఇప్పుడు ప్రజలలో వస్తున్న స్పందన చూసి జిల్లాల కలెక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు ఆర్డీవోలు మాత్రమే అందుబాటులో ఉండే ప్రాంతాలకు తాము వచ్చామని, దానివల్ల తమ స్థాయి తగ్గిపోయిందని మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించినా, ఆ తర్వాత ప్రజల అవసరాలు తీరుతున్న తీరు చూసి ఆశ్చర్యం వేస్తోందని ఇటీవల ఓ కలెక్టర్ చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలకు అధికార యంత్రాంగం బాగా దగ్గరవుతుందని, జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకోగల అత్యున్నత అధికారి దగ్గరగా ఉంటే, ప్రజలు తమకు కావల్సిన విషయాలను నేరుగా చెప్పుకొనే అవకాశం ఉంటుందని, దానికితోడు ప్రజల అవసరాలను ప్రత్యక్షంగా గమనించే అవకాశం తమకు కూడా వస్తుందని ఆయన వివరించారు. పాత జిల్లాల కంటే కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత పరిపాలనా సౌలభ్యం ఎన్నోరెట్లు పెరిగిందని విశ్లేషించారు. దాంతో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని తేలింది.

ప్రతి ఊళ్లో గుడి ఉంటుంది. ఆ గుడిలో ఓ బక్క బ్రాహ్మణుడు తప్పనిసరిగా ఉంటారు. నిత్యం తాను ఆరాధించే దేవుడికి దీపధూప నైవేద్యాలు పెట్టడం కూడా భారమైనా ఎలాగోలా తల తాకట్టు పెట్టి, తాను పస్తులు ఉండి అయినా సరే.. దేవుడిని మాత్రం వదలడు. ఇలాంటి పురోహితులు చాలా ఊళ్లలో కనిపిస్తారు. చిన్న చిన్న ఆలయాలకు రోజూ వచ్చే భక్తులు పెద్దగా ఉండరు. దాంతో ఆదాయం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. దేవుడికి కనీసం దీపం పెట్టి నైవేద్యం పెట్టాలన్నా ఖర్చు తప్పదు. ప్రజలందరూ బాగుండాలని పూజలు చేసే బాపనోళ్ల బాగోగులు చూడటానికి మాత్రం ఇంతకాలం ప్రభుత్వాలకు మనసు రాలేదు. తొలిసారిగా అర్చకులందరికీ పేస్కేలుతో జీతాలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించడంతో వాళ్లు మనస్ఫూర్తిగా ఆనందించి, ఆ నిర్ణయాన్ని ఆహ్వానించారు. అర్చక సంఘాల ప్రతి నిధులతో దాదాపు 2000 మందికి పైగా బ్రాహ్మణు లతో కేసీఆర్ సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించినపుడు వాళ్లలో ఉన్న పలువురు వృద్ధ బ్రాహ్మణులు కూడా మనస్ఫూర్తిగా నవ్వుతూ చప్పట్లు కొట్టడం స్పష్టంగా కనిపించింది. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇదే బ్రాహ్మణ వర్గం ప్రభు త్వం మీద తీవ్రంగా మండిపడుతోంది. ముఖ్యం గా బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకదాన్ని మొక్కుబడిగా ఏర్పా టుచేసినా.. దాని వల్ల కలుగుతున్న ప్రయోజ నాలు పెద్దగా ఏమీ లేవని, ముఖ్యంగా బక్క బ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లే దని అక్కడ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు బ్రాహ్మణ కార్పొరేషన్‌కు తొలి చైర్మన్‌గా వ్యవహ రించిన మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావును అత్యంత అవమానకర రీతిలో పంపించా రంటూ మండిపడుతున్నారు. ఇటు తెలంగాణ సీఎం మాత్రం .. యజ్ఞాలు, యాగాలు చేయిస్తూ, బ్రాహ్మణోత్తములు ఎదురుపడితే కాళ్లకు నమస్కారాలు కూడా చేస్తున్నారు. ఈ తేడాను స్పష్టంగా గమనిస్తున్న సాధారణ ప్రజలు రెండు ప్రభుత్వాల పనితీరును బేరీజు వేసుకుంటున్నారు.

ఒకవైపు కులవృత్తిదారులందరికీ ఒక్కో రకంగా సాయం చేస్తూ ఒక్కో కులానికి ఒక్కో పథకం చేపడుతున్న కేసీఆర్.. మరో వైపు కాపులను బీసీలలో చేరుస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పడు దాన్ని నెరవేర్చలేక కాపులకు, నెరవేరిస్తే బీసీలకు దూరమయ్యే పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. పరిపాలన అంటే వైకుంఠపాళీ ఆట లాంటిదేనని, అక్కడ నిచ్చెనతో ఎంత పైకి ఎక్కినా, పక్కనే ఉండే పాములు మళ్లీ కిందకి లాగేస్తుంటాయని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని చెప్పిన కేసీఆర్.. ఆ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఇక్కడ కూడా ఎదురుదెబ్బలు లేకపోలేవు. ఉద్యోగాల భర్తీ విష యంలో టీఎస్‌పీఎస్సీ అనుసరిస్తున్న కొన్ని విధానాల పట్ల నిరుద్యోగులలో కొంతవరకు అసంతృప్తి ఉంది. అయితే, నేరుగా ప్రభుత్వం మీద అది పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఎందుకంటే నిరుద్యోగుల కుటుంబాలన్నింటికీ ఏదో ఒక రూపంలో మరేదో సాయం అందుతోంది. అందువల్ల మొత్తంగా పాలనను మాత్రం తప్పు పట్టడం లేదు. కనిపించిన లోటు పాట్లన్నింటినీ సవరించుకుంటూ మంత్రులను కూడా కేసీఆర్ పరుగులు పెట్టిస్తున్నారు. కేవలం కొడుకు అన్న ఏకైక అర్హతతో మాత్రమే తనకు మంత్రిపదవి రాలేదన్న విషయాన్ని కేటీఆర్ కూడా రుజువు చేసుకుంటున్నారు. ఢిల్లీ, ముంబై పర్యటనలకు వెళ్లినపుడు రామ్ అంటూ ఉన్నతా ధికారులు, మంత్రులు, వ్యాపార వాణిజ్య వేత్తలు ఆయన చొరవను మెచ్చుకుంటున్నారు. మంత్రులంతా రామ్ లాగే చొరవ చూపించి తమ రాష్ట్రాలను ప్రమోట్ చేసుకుంటే రాష్ట్రాలు కూడా అభివృద్ధి విషయంలో పరుగులు తీస్తాయని బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు కూడా ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఏపీ ముఖ్య మంత్రి తనయుడు మాత్రం దొడ్డిదారిలో మంత్రి కావడం, ప్రమాణస్వీకారం దగ్గర నుంచి చాలా విషయాల్లో తడబడటం లాంటి వాటితో విమర్శల పాలవుతున్నారు.

సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు రెండింటి మధ్య పోలిక పెడుతుంటారు. అలాంటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి.. విపత్తుల వల్ల కూడా కొంత మేలే జరుగుతుంది లాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజాదరణకు దూరం అవుతున్న వైనాన్ని చంద్రబాబు కూడా తెలుసుకోవాలి. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతోందో.. మనం ఏం చేస్తున్నామో ఆయన అర్థం చేసుకోవాలి. అప్పుడే చేసే పనికి కూడా సార్థకత ఉంటుంది, కాస్తో కూస్తో ప్రజాదరణ సాధించే అవకాశం వస్తుంది. లేనంత కాలం ప్రజల వ్యతిరేకతను చవిచూడక తప్పదు.

చంద్రశేఖర శర్మ

Show Full Article
Print Article
Next Story
More Stories