కులవృత్తులతో ఆర్థిక వృద్ధా? రాజకీయ లబ్దా?

కులవృత్తులతో ఆర్థిక వృద్ధా? రాజకీయ లబ్దా?
x
Highlights

అధికారంలో ఉన్న పార్టీ ఏ పథకం చేపట్టినా అందులో రెండు ప్రయోజనాలు ఆశిస్తుంది. ఒకటి ప్రజల సంక్షేమం.రెండు ఓట్లు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల ఓట్లు...

అధికారంలో ఉన్న పార్టీ ఏ పథకం చేపట్టినా అందులో రెండు ప్రయోజనాలు ఆశిస్తుంది. ఒకటి ప్రజల సంక్షేమం.రెండు ఓట్లు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల ఓట్లు కీలకమన్నది అందరికీ తెలిసిందే. ఈ విషయం తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఇంకా బాగా తెలుసు. ఉద్యమం రోజలు నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా ఆయన వేసే ఎత్తుగడలు అంచనాలకు అందవు. వివిధ కులాల కోసం ఆయన చేపడుతున్న పథకాలు కూడా అలాంటివే.

గ్రామీణ ఆర్థిక అభివృద్ధి ద్వారా.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటును పెంచుకోవచ్చన్నది తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచన. ముఖ్యంగా కులవృత్తులను అనేక మార్గాల్లో ప్రోత్సహించడం ద్వారా కార్పొరేట్ల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన ఆయా వృత్తులను తిరిగి సామాన్యుడి చెంతకు తీసుకురావాలన్నది ఆయన ప్రయత్నం. సామాన్యుడి నుంచి కులవృత్తులను దూరం చేసి కార్పొరేట్ కల్చర్‌కు సాఫిస్టికేటెడ్‌గా వాటిని బదిలీ చేసి కంప్యూటర్లు, ఏసీ గదుల్లో స్పెషల్ డ్రెస్‌కోడ్‌తో అవే వృత్తులు చేసి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న ఎకానమీ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం పల్లెబాట పట్టిస్తున్నది. ఒక్కో వృత్తిని గుర్తించి.. దాని ద్వారా ఆర్థిక పరిపుష్టి ఏ విధంగా జరుగుతుందో సుక్ష్మ స్థాయిలో అంచనాలు వేసి ఆయా వృత్తుల వారీగా పథకాలను ప్రవేశపెట్టడం టీఆర్‌ఎస్ చేస్తున్న పని.

ఇందులో మొదటగా ఆయన గొల్ల కురుమలను ఎంచుకొన్నారు. గణాంకాలు తీసుకొన్నారు. ప్రతిరోజూ రాజస్థాన్ నుంచో.. లేక పొరుగు రాష్ర్టాల నుంచో సుమారు 650 లారీల గొర్రెలు తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. అందులో సగం హైదరాబాద్‌కే వస్తున్నాయి. ఫైవ్‌స్టార్ హోటళ్లు.. బావర్చీ లాంటి హోటళ్లకు మనం వెళ్లి రకరకాల పేర్లతో పెట్టే నాన్‌వెజ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటామే తప్ప దాని ప్రాడక్టివిటీ గురించి ఆలోచించం. హైదరాబాద్ రాంనగర్‌లోని చేపల మార్కెట్‌లోనూ అదే పరిస్థితి. దిగుమతి తప్ప మరో దారి లేదు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని గొల్ల కురుమలకు 75శాతం సబ్సిడీపై గొర్రెలు, పొట్టేళ్ల పంపిణీ, మత్స్యకారులకోసం చెరువులు..కుంటల్లో చేపల పెంపకం మొదలుపెట్టారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన 35 లక్షల గొర్రెలకు దాదాపు 13 లక్షల పిల్లలు పుట్టాయని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంటే దాదాపు 48 లక్షల గొర్రెలయినాయన్నమాట. ఒక గొర్రె ధర ఎంత ఉంటుందో మనకు తెలియంది కాదు.. వీటికోసం మీట్ ప్రాసెసింగ్ యూనిట్లనూ పెడుతున్నారు.

మొత్తం లక్ష్యం ప్రకారం 84 లక్షల గొర్రెల పంపిణీ ఎలాంటి అవినీతికి తావులేకుండా, సమర్థంగా పూర్తయితే.. వాటి పెంపకం సరిగ్గా జరిగితే దిగుమతి స్థానంలో ఎగుమతి మొదలవుతుంది. తెలంగాణ వచ్చిన గీతకార్మికుల కోసం వెంటనే కల్లు దుకాణాలు పునరుద్ధరించారు. చేనేత కార్మికులకోసం చాలా చర్యలు తీసుకున్నారు. రూ.1200 కోట్ల వ్యయంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పవర్‌లూమ్‌లను వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఆధునీకరించారు. 50 శాతం సబ్సిడీతో నూలు, రసాయనాలు అందిస్తున్నారు. నేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. మొన్న బతుకమ్మ చీరల పంపిణీకి 50శాతం చీరలు తెలంగాణ చేనేత కార్మికుల నుంచి కొన్నవే. నాణ్యతలో తేడా ఉన్నప్పటికీ వీరి నుంచే తీసుకొన్నారు.

వరంగల్‌లో మూతపడిన ఆజంజాహి మిల్ స్థానంలో టెక్స్‌టైల్ పార్కుకు శ్రీకారం చుట్టడం వల్ల చేనేత కార్మికులకు కాకుండా పత్తిరైతులకూ మేలు జరుగుతుంది. రజకులకోసం ఆధునిక ధోభీ ఘాట్లను, డ్రైయర్లను ఇస్తున్నారు. 25వేల మంది నాయీబ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకోవడానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి ప్రకటించారు. విశ్వబ్రాహ్మణుల కులవృత్తులను ప్రోత్సహించడానికి రూ.250 కోట్లతో కార్యక్రమాలు అమలు చేయనున్నారు. ఇలా ఆయన తెలంగాణలో ఉన్న బీసీ కులాలన్నింటికీ ఆకట్టుకుంటున్నారనడంలో సందేహం లేదు. వీరి కోసం
పెడుతున్న పెట్టుబడులు రేపు వచ్చే ఎన్నికలలో పార్టీకి ఎంత వరకు ఫలాలను అందిస్తాయన్నది వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories