తలసానికి షాక్‌...?

Submitted by arun on Thu, 07/12/2018 - 17:41

సైకిల్ గుర్తుపై గెలిచారు ఆపై స్పీడు బాగుందని కారెక్కేశారు కెరీర్ హాయిగా సాగిపోతుండగా తన కొడుకుని ఎంపీని చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రయత్నాలూ మొదలు పెట్టారు కానీ బ్యాడ్ లక్ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. పుత్రరత్నానికి ఎంపీ సీటు కోసం చేసిన ట్రయల్స్  ఆ నేత ఉన్న పదవికే ఎసరు తెచ్చేలా తయాయ్యాయి.. ఇంతకీ ఆ నేత ఎవరా అని ఆలోచిస్తున్నారా? 

టీడీపీ టిక్కెట్‌పై గెలిచారు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు అదికార పార్టీ కారెక్కి కేబినేట్ పదవిని అనుభవిస్తున్నారు ఆయనే సనత్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నగరంలో బీసీ కోటా కింద ఏకఛత్రాధిపత్యం అనుభవిస్తున్న మంత్రికి ఎదురవుతున్న అనూహ్య పరిణామాలు ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. 

ఈ సారి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నుంచి తన కుమారుడికి ఎంపీ టిక్కెట్ ఇప్పించేందుకు తలసాని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించి దేశ రాజధానికి పంపించాలని అనుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఆ ప్రయత్నం మాత్రం ఆదిలోనే బెడిసికొట్టినట్లైంది. విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్తే ఆయన్నుంచి వచ్చిన సమాధానం తలసానికి షాక్ కొట్టినట్లైంది. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా తలసానినే పోటీ చేయాలని కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. దీంతో తన వ్యూహం ఇంతలా ఎదురుతిరుగుతుందని ఊహించని తలసాని ప్రత్యామ్నాయ దారులను వెతికే పనిలో పడ్డారు. 

ముఖ్యంగా హైదరాబాద్ రాజకీయాల్లో తలపండిన తలసానికి ఢిల్లీ వెళ్లి చేసేదేం లేదని తెలుసు. అందుకే ఆయనకు ఎంపీ సీటుపై ఎలాంటి ఆశ లేదని చెప్పొచ్చు. అయితే కేసీఆర్ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన వెనుక ఆసక్తికరమైన చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి దండే విఠల్ పోటీ చేసి తలసాని చేతుల్లో ఓడి రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే విఠల్ మంత్రి కేటీఆర్‌కు మంచి స్నేహితుడు. ఈ సారి సనత్‌ నగర్ టిక్కెట్‌ను విఠల్‌కే దక్కేలా కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తలసానికి ఎంపీగా పోటీ చేయించాలనే ప్రతిపాదన వచ్చిందని పార్టీ శ్రేణుల బోగట్టా. దీంతో అటు కుమారుడికి ఎంపీ సీటు ఆశిస్తే అది తిరిగి తన సీటుకే ఎసరు పెట్టేలా ఉందని తలసాని గ్రహించారు. 

వచ్చే ఆపదను ముందే పసిగడితే.. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం అంత కష్టమైన పనికాదు. ఈ విషయంలో ఓ అడుగు ముందే వేసిన తలసాని నగరంలో తన పలుకుపడిని చూపించాలని ఉవ్వీళ్లూరారు. అందులో భాగంగానే గ్రేటర్ కాంగ్రెస్‌లో కీలక నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ను కారెక్కించడంలో తలసాని ముఖ్యపాత్ర పోషించారని చెబుతారు. అయితే ఇదే సమయంలో మరో సీనియర్ లీడర్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా కారెక్కేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ బీసీ ఓట్లను రాబట్టడంలో మంచి పట్టున్న ముఖేశ్‌గౌడ్‌ వస్తే పార్టీలో తనకున్న ప్రాధాన్యం తగ్గిపోతుందని తలసాని భావించారని అందుకే ఆయన రాకను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గ్రేటర్‌కే చెందిన మరో మంత్రి పద్మారావుకు మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో ఎలాగైనా కారెక్కేందుకు ముఖేశ్‌ గౌడ్  అటువైపు నుంచి నరక్కొస్తున్నారని సమాచారం. 

దీంతో ఇటు కుమారుడికి సీటు ఇప్పించుకోలేక అటు పార్టీలో పట్టు సాధించుకోలేక తలసాని తల పట్టుకున్నారని చెబుతున్నారు. ఇలాంటి ముక్కోణపు ఆటలో తలసానికి పార్టీ హైకమాండ్ షాకివ్వబోతోందనే ప్రచారం పార్టీవర్గాల్లో షికారు చేస్తోంది. ఇందులో భాగంగానే తలసాని హవా తగ్గించేందుకు ఆయన శాఖల్లో కోత పెట్టే అవకాశాలూ లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో తలసాని లాంటి నాయకుడికి టిక్కెట్ విషయంలో ఇబ్బందులకు గురిచేస్తే అది పార్టీకే నష్టమనే వాదనా తెరపైకి వస్తోంది. ఏదేమైనా అపర చాణక్యుడు.. కేసీఆర్.. తలసాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 

English Title
CM KCR Gives Shock To Talasani

MORE FROM AUTHOR

RELATED ARTICLES