కలిసికట్టుగా సాగితేనే టికెట్లు...

Submitted by arun on Sun, 11/04/2018 - 10:45
CM Chandrababu, AP CM Chandrababu Naidu

ప్రకాశం జిల్లా నేతలకు సీఎం చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా సాగితేనే టికెట్లు దక్కుతాయంటూ తెగేసి చెప్పారు. జిల్లాలో పార్టీ బలంగా ఉన్నా నాయకుల మధ్య విభేదాలతోనే సమస్యలు వస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రకాశం జిల్లాలో నాయకుల మధ్య విభేదాలపై సీఎం చంద్రబాబు భగ్గుమన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నా నేతల తీరు వల్ల ఓటు రూపంలోకి మారడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారిగా సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నేతల మధ్య విభేదాలపై కటువుగానే స్పందించారు. పార్టీ కేడర్‌ను  కలుపుకుపోవడంలో విఫలమవుతున్నారంటూ యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజును మందలించినట్టు సమాచారం. రాబోయే మూడు నెలల్లో పని తీరు మెరుగుపడకపోతే ముందు ముందు కష్టాలు తప్పవని చెప్పినట్టు తెలుస్తోంది.  

వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై సమీక్ష సందర్భంగా నేతలకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని కేడర్‌కు అండగా నిలవాలంటూ సూచించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో కొందరు నేతలు పార్టీ కంటే తామే బలవంతులమని భావిస్తున్నారని తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు. వ్యక్తుల కంటే పార్టే ముఖ్యమనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని హితబోధ చేశారు.  

జిల్లా పార్టీ అద్యక్షుడు దామచర్ల జనార్ధన్‌కు కూడా చంద్రబాబు క్లాస్‌ పీకారు. కుటుంబ సభ్యులనే కలుపుకోక పోతే ఎలాగంటూ ప్రశ్నించారు. బాబాయి కొడుకుతో ఎడమొహం పెడమొహంగా ఉంటే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళతాయన్న విషయం తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అప్పటికప్పుడు బాబాయి, అబ్బాయిలను ఏకం చేసిన చంద్రబాబు కార్యకర్తలకు ఇదే సంకేతాన్ని పంపారు. మార్కాపురం నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు చందంగా ఉందంటూ పార్టీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పరిస్థితిలో మార్పురాకపోతే  తాను చేసేది ఏమిలేదంటూ హెచ్చరించారు. 

ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డిని నియమించినందు వల్ల కలిసి పని చేసుకోవాలన్నారు. ఇక నుండి ప్రతి నెల  జిల్లాలో పర్యటిస్తానని అభివృద్దితో పాటు నాయకుల పనితీరును అంచనా వేస్తానని దీని బట్టే ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తానంటూ నేతలకు మార్గనిర్దేశం చేశారు. నివేదికల సాక్షిగా జిల్లా నేతలందరికి చంద్రబాబు క్లాస్ పీకడంతో అంతా అవాక్కయ్యారు. పనితీరు ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉందని చెప్పడంతో భవిష్యత్‌పై నేతలు దృష్టి సారించారు.   
 

English Title
Cm chandrababunaidu fire on tdp leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES