జైపాల్‌రెడ్డి వర్సెస్ డీకే అరుణ

x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మరో వివాదం రాజుకుంది. పాలమూరు జిల్లాలో నేతల ఆధిపత్య పోరు తీవ్రం కావడంతో మళ్లీ రచ్చకెక్కుతున్నారు. నాగం జనార్ధన్‌రెడ్డి...

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో మరో వివాదం రాజుకుంది. పాలమూరు జిల్లాలో నేతల ఆధిపత్య పోరు తీవ్రం కావడంతో మళ్లీ రచ్చకెక్కుతున్నారు. నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి నష్టం కలుగుతుందంటున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలను తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పీసీసీపై మండిపడుతున్నారు.

టీ.పీసీసీలో కొత్త చేరికలపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు జిల్లాలో గత నెల రోజుల నుంచి ఇదే వ్యవహారంపై నేతల మధ్య వివాదం ఏర్పడింది. బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతుండటంతో అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీ నేతలు.

తమ అభ్యంతరాలను పీసీసీ పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని స్వయంగా కలిసి ఇప్పటికే ఫిర్యాదు చేశారు నాగర్‌కర్నూలు జిల్లా నేతలు. గత 20 ఏళ్లుగా పార్టీని ఇబ్బంది పెట్టిన నాగం జనార్ధన్‌రెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని జిల్లా నేతలు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు నాగం చేరికపై మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి లైన్‌క్లియర్ చేస్తుండటంతో మాజీ మంత్రి డీకే అరుణ వర్గం మాత్రం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. నాగం జనార్ధన్‌రెడ్డిని తన ఆధిపత్యం కోసమే జైపాల్‌రెడ్డి పార్టీలో చేర్చుకుంటున్నారని మాజీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి ఆరోపించారు. నాగం పార్టీలో చేరితే నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదన్నారు. తమను కాదని నాగంను పార్టీలోకి తీసుకుంటే..తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని హెచ్చరించారు. పాలమూరు జిల్లాలో జైపాల్‌రెడ్డి వర్సెస్ డీకే అరుణ వర్గాల ఆధిపత్య పోరు పీసీసీకి తలనొప్పిగా మారింది. మరి ఈ వివాదానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories