టాలీవుడ్లో విషాదం.. నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత

టాలీవుడ్లో విషాదం.. నటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూత
x
Highlights

ప్రముఖ సినీనటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన .. రెండేళ్లుగా చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఈ రోజు...

ప్రముఖ సినీనటుడు వైజాగ్ ప్రసాద్ కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన .. రెండేళ్లుగా చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆయనకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు .. సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు పొందిన వైజాగ్ ప్రసాద్ ... అగ్ర తారలకు తండ్రి, మామ పాత్రలు పోషించారు. సహాయ నటుడితో పాటు ప్రతినాయకుడి పాత్రలు పోషించి ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు పొందారు.

75 ఏళ్ల వైజాగ్ ప్రసాద్‌కు భార్య ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విశాఖ జిల్లా గోపాలపురంకు చెందిన ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాదరావు. ఈయన సినీరంగంలో ప్రవేశించే సమయానికి పలువురు ప్రసాద్‌లు ఉండటంతో వైజాగ్ ప్రసాద్‌గా గుర్తింపు పొందారు. దీర్ఘకాలంలో ఇదే ఆయన పేరుతో స్ధిరపడింది. 1963లో నాటక రంగంలోకి ప్రవేశించిన ప్రసాద్ .. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన అప్పు పత్రం, భలే పెళ్లి, భజంత్రీలు, కాల ధర్మం, ఆకలి రాజ్యం నాటికలతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. సుమారు 700 నాటికల్లో నటించిన ఆయన 1983లో బాబాయ్‌ అబ్బాయ్‌ మూవీ ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యారు. నువ్వు నేను, భద్ర, జై చిరంజీవ, నీరాజనం, జెమిని, అల్లరి బుల్లోడు, సుందరకాండ చిత్రాల్లో తన నటన ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.

చిన్ననాటి నుంచే రంగస్ధలంపై ఉన్న మోజుతో అగ్రికల్చర్ BSC, MBBS అవకాశాలను పోగొట్టుకున్నాడు. మేనమామ ప్రోత్సహంతో బీఏ పూర్తి చేసిన అనంతరం సినిమాలపై దృష్టి సారించాడు. ప్రసాద్ దంపతులకు రత్నప్రభ, రత్నకుమార్ అనే ఇద్దరు పిల్లలున్నారు. కంప్యూటర్ ఇంజనీర్లుగా ఉన్న వీరిద్దరూ విదేశాల్లోనే స్ధిరపడ్డారు. వైజాగ్ ప్రసాద్ మృతితో సినీరంగం గోప్ప నటుడిని కోల్పోయిందని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ సంతాపం తెలిపింది. ప్రసాద్ కుమార్తె, కుమారుడు అమెరికా నుంచి వచ్చిన తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories