జనసేనలోకి చిరంజీవి ఎంట్రీ ...?

Submitted by arun on Sat, 07/14/2018 - 12:23
Jana Sena

గత కొద్దికాలంగా పొలిటికల్ స్క్రీన్ పై సైలెంట్ గా ఉంటున్న చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీకి సిధ్దమవుతున్నారా జనసేనలో చిరు కీ రోల్ ప్లే చేయబోతున్నారా ఇప్పటికే మెగా అబిమానులను జనసేనలోనికి పంపిన మెగాస్టార్ తాను కూడా జనసేన స్ర్కీన్ పై కన్పించబోతున్నారా.

మొన్నటి దాకా వారివి వేర్వేరు దారులు ఇప్పుడు ఒక్కటయ్యారు కలసి అడుగులేస్తున్నారు వారే మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానులు. ఈ అభిమాన సంఘాలు రెండూ కలసి పోవడం ఎన్నికలకు కలసి పని చేస్తామని చెప్పడం చూస్తుంటే ఏపీ రాజకీయ తెరపై సందడి పెరిగిపోతోంది. 2019 ఎన్నికలకు జనసేన వేగంగా రెడీ అవుతోందని ఈసంఘటన నిరూపిస్తోంది.అధికార, ప్రతిపక్ష పార్టీలను గట్టిగా ఢీకొట్టేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం జనసేన స్ర్కీన్ పై పవన్ కల్యాణ్ మాత్రమే కనిపించేవారు. కాని ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వివిధ పార్టీలకు చెందిన నేతలను వివిధ రంగాలకు చెందిన నిపుణులను పార్టీలోకి ఆహ్వానించి జెండా కప్పేస్తున్నారు. మొన్నటి దాకా కుటుంబంనుంచి జనసేనకు ఎటువంటి మద్దతు లభించలేదు. అయితే తాజాగా మెగా కుటుంబం మొత్తం జనసేనాని పవన్ వెనక మేమున్నమంటూ  ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులను జనసేన పార్టీలోకి పంపారు మెగా స్టార్ చిరంజీవి. రానున్న కాలంలో చిరంజీవి కూడా తమ్ముడి పార్టీలో కీ రోల్ ప్లే చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

2009లో ప్రజారాజ్యాన్ని ఒక మంచి ఉద్దేశంతోనే ప్రారంభించినా పార్టీని నడపడంలో విఫలమయ్యారు చిరంజీవి. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర సహాయ మంత్రిగా నియమించినా చిరంజీవి పెద్దగా కాంగ్రెస్ కార్యక్రమాలలో పాలుపంచుకోలేదు. చాలా కీలకమైన సమయాల్లో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండిపోయారు. మళ్లీ వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తిరిగి తన హవాను ఇండస్ర్టీలో కొనసాగిస్తున్నారు. చిరంజీవి సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లే అంతా భావించారు. కానీ చిరంజీవిని పవన్ తిరిగి తన పార్టీలోకి ఆహ్వనిస్తారని జనసేనలో గౌరవ అధ్యక్ష పదవి కూడా పవన్ కట్టబెట్టబోతున్నారని సన్నిహితవర్గాలం టున్నాయి. గతంలో తన అన్నయ్యకు ద్రోహం చేసిన వారిని ఊరికే వదిలిపెట్టనని పవర్ స్టార్ అనడం చూస్తుంటే చిరంజీవిని మళ్లీ ఓ సక్సెస్ ఫుల్ లీడర్ లా చూపించాలన్నది పవన్ తాపత్రయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి మరో మూడు నెలల్లో జనసేన పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తారన్నది మెగా అభిమానుల మనస్సులో మాట. ఈ ఊహాగానమే మెగా అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటే చిరు నిజంగానే రంగంలోకి దిగితే ఏపీ రాజకీయ తెరపై అసలు యుద్ధం మొదలైనట్లేనంటున్నారు విశ్లేషకులు.

English Title
Chiranjeevi To Join Jana Sena Soon ?

MORE FROM AUTHOR

RELATED ARTICLES