యాదాద్రి పీఎస్‌కు ఒక్కొక్కరిగా వస్తున్న తప్పిపోయిన చిన్నారుల తల్లిదండ్రులు

x
Highlights

ఇంటి ముందు ఆడుకుంటుంటే ఒకరిని.. స్కూలు నుంచి తిరిగొస్తుంటే మరొకరిని.. అలా పార్కుల్లో.. రోడ్లమీద.. ఎక్కడ చాన్స్ దొరికితే అక్కడ పిల్లలను కిడ్నాప్...

ఇంటి ముందు ఆడుకుంటుంటే ఒకరిని.. స్కూలు నుంచి తిరిగొస్తుంటే మరొకరిని.. అలా పార్కుల్లో.. రోడ్లమీద.. ఎక్కడ చాన్స్ దొరికితే అక్కడ పిల్లలను కిడ్నాప్ చేసేశారు. వారందరినీ.. తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు. అలా బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులందరికీ.. ఆపరేషన్ ముస్కాన్ కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. వ్యభిచార కూపాల నుంచి విముక్తి పొందిన వారిలో తమ బిడ్డలున్నారేమోనని.. యాదాద్రి పోలీస్ స్టేషన్‌కు ఒక్కొక్కరిగా వస్తున్నారు.

ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లలు కనిపించకుండా పోతే ఆ బాధ ఎలా ఉంటుందో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకే తెలుసు. బిడ్డలు అదృశ్యమైనప్పటి నుంచి వారికోసం వెతకని చోటంటూ లేదు. ఆచూకీ కోసం తిరగని ప్రదేశమంటూ లేదు. అలా.. బిడ్డల కోసం రోజులు నెలలు సంవత్సరాలు. వెతికి వెతికి అలసిపోయారు. ఇప్పటికీ వారి జ్ఞాపకాలను తలచుకోని రోజంటూ లేదు. ఎప్పటికైనా తమ పిల్లలు దొరుకుతారనే ఆశ తిరిగొస్తారనే బలమైన నమ్మకం ఆ తల్లిదండ్రులను ఇప్పటికీ ఎదురుచూసేలా చేస్తోంది. అలా బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల్లో ఆపరేషన్ ముస్కాన్ కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.

ఆపరేషన్ ముస్కాన్ పేరుతో పోలీసులు చేపట్టిన మంచి కార్యక్రమం ఎంతోమంది చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. వ్యభిచార కూపాల్లో కూరుకుపోయి నరకం అనుభవిస్తున్న అమ్మాయిలకు జీవితంలో కొత్త పేజీ మొదలుపెట్టే అవకాశమిచ్చింది. యాదాద్రిలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో పోలీసులు 15 మంది అమ్మాయిలకు వ్యభిచార కూపం నుంచి విముక్తి కలిగించారు. వారిలో తమ బిడ్డలున్నారేమోనన్న ఆశతో పేరెంట్స్ ఒక్కొక్కరిగా యాదాద్రి పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారు.

బిడ్డలను కోల్పోయిన బాధ ఎప్పటికైనా దొరుకుతారనే ఆశ రక్తం పంచుకు పుట్టిన పిల్లల కోసం తల్లిదండ్రుల కడుపుతీపి ఇలా ప్రతి ఒక్క కారణం చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రులను యాదాద్రికి రప్పిస్తోంది. ఆ 15 మంది చిన్నారుల్లో తమ బిడ్డలున్నారేమోనన్న అనుమానంతో కొందరు నమ్మకంతో మరికొందరు పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారు. కనిపించకుండా పోయిన తమ పిల్లల వివరాలను, వారికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు చూపిస్తున్నారు.

ఆపరేషన్ ముస్కాన్‌లో బయటపడిన మానస అనే చిన్నారి తల్లిదండ్రులమంటూ హైదరాబాద్ ఇసిఐఎల్ నుంచి ఓ జంట వచ్చింది. 4 ఏళ్ల క్రితం తమ బిడ్డ మానస తప్పిపోయిందని చెప్తున్నారు. వారి దగ్గర ఉన్న ఫోటోలు, ఇతర వివరాలు, సర్టిఫికెట్లను పోలీసులకు చూపించారు. మరో అమ్మాయి కోసం ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి తల్లిదండ్రులు వచ్చారు. తమ బిడ్డ తప్పిపోయి 9 నెలలు అవుతోందని చెప్తున్నారు. వ్యభిచార కూపం నుంచి విముక్తి పొందిన 15 మంది చిన్నారుల్లో తమ బిడ్డ కూడా ఉందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారుల కోసం పోలీస్ స్టేషన్‌కు వస్తున్న పేరెంట్స్ నుంచి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. డీఎన్ఏ టెస్ట్ తర్వాత రిపోర్ట్స్ మ్యాచ్ అయిన వారికే అమ్మాయిలను అప్పగించే యోచనలో ఉన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో బయటపడిన 15 మంది చిన్నారులు ప్రస్తుతం ప్రజ్వల స్వచ్ఛంధ సంస్థ సంరక్షణలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories